BRS Leader KTR Fires on Congress :ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆలోచించాలని, ఎవరికి ఓటు వేస్తే ప్రయోజనం కలుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. 10 ఏళ్ల క్రితం బడేభాయ్ నరేంద్ర మోదీ అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మనుషుల మనసులో విషం నింపి రాజకీయాలు చేస్తున్న మోదీకి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను ఆ పార్టీ మోసం చేసిందని విమర్శించారు.
మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ మైనార్టీ కార్యకర్తల సమావేశం హైదరాబాద్ కుషాయిగూడలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్, కేసీఆర్ హయాంలో మైనార్టీల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కేసీఆర్ హిందువుగా ఆయన ధర్మాన్ని పాటించారు కానీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోలేదని అన్నారు. రంజాన్ తోఫా మీకు వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత ఆరు గ్యారంటీలు నమ్మి ప్రజలు మనల్ని ఓడించారు. కానీ హైదరాబాద్ ప్రజలు నమ్మలేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పాలనలో 204 మైనార్టీ స్కూల్స్ పెట్టాం :కాంగ్రెస్ వచ్చిన నాలుగున్నర నెలల్లోనే కరెంట్, నీళ్ల కష్టాలు మొదయ్యాయని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారే కానీ మత రాజకీయం చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో 204 మైనార్టీ స్కూల్ పెట్టామని, వందకు పైగా మైనార్టీ మహిళల కొరకు పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. అలానే ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు.