BRS Leader Harish Rao on Employees Salaries :ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆక్షేపించారు. మోడల్ స్కూల్ టీచర్స్‌కు గత ఏడు నెలల నుంచి కూడా ఒకటో తేదీన వేతనాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు.
ఈ నెలలో ఇప్పటి వరకు 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎనిమిదో తేదీన సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన సర్కారు, రంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి తదితర జిల్లాలో పని చేస్తున్న వెయ్యి మందికి పైగా రెగ్యులర్ టీచర్స్‌కు ఇంకా వేతనాలు చెల్లించలేదని హరీశ్‌రావు తెలిపారు.
ఉపాధ్యాయులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి :మోడల్ స్కూల్స్‌లో పనిచేసే అవుట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ దాదాపు రెండు వేల మందికి ప్రభుత్వం ఇంకా వేతనాలు చెల్లించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఉపాధ్యాయులను గౌరవించి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం బాధాకరమని ఆయనన్నారు.
అధికారంలోకి రాగానే 42 వేల రూపాయల వేతనం చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ, వారి ఉద్యోగ భవిష్యత్‌ను దెబ్బతీసేలా కేవలం మార్చి 31 నుంచి జులై 31 వరకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమని మాజీ మంత్రి మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలల్లో సెలవులే ఉండగా, కేవలం జూన్, జులై నెలకు మాత్రమే పొడిగింపు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆక్షేపించారు.