BRS Leader Dasoju Sravan Comments on CM Revanth :ఆంధ్రప్రదేశ్తో సమానంగా పని చేస్తామన్న ముఖ్యమంత్రి వాదన సరి కాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. వైద్య ఆరోగ్యం సహా అనేక సూచికల్లో తెలంగాణ ఏపీ కంటే మెరుగ్గా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన దాసోజు శ్రవణ్, అభివృద్ధిలో మెరుగైన ప్రమాణాలతో పోల్చుకుని పోటీ చేయాలని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార మనస్తత్వాన్ని విడిచిపెట్టి, ప్రజల సంక్షేమం కోరుకునే విశాల దృక్పథం కలిగిన నాయకుడిగా పరిణితి చెందాలని హితవు పలికారు.
తెలంగాణలో ప్రభుత్వ రంగంలో బలమైన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ అవసరం ఉందన్న దాసోజు, ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించకుండా ముఖ్యమంత్రి ఆరోగ్య పర్యాటకం పేరుతో మరిన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందుకోసం వేల ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యవస్థలకు కేటాయించడం, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అని, ప్రజల సంక్షేమం ఏమాత్రం కాదని మండిపడ్డారు.