BRS Leader Harish Rao On Rythu Bharosa :రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రైతు భరోసాకు కూడా షరతులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. రైతు భరోసా పథకానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారట అని ఆక్షేపించారు.
బడా కంపెనీలు, కార్పొరేట్ వ్యాపారులకు ఎలాంటి షరతులు లేవన్న హరీశ్‌రావు రైతులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులను మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆక్షేపించారు. ఏ దరఖాస్తు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆక్షేపించారు.
రైతునోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు :వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పినవిధంగా ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకేసారి రూ.15 వేల చొప్పున ఇవ్వాలని ఆయన అన్నారు. పత్తి, చెరకు, పసుపు పంటలకు ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇస్తామంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. సాగునీటి సౌకర్యం లేని రైతులు ఒకపంట మాత్రమే సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షరతుల పేరిట రైతునోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.