BRS Formation Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా గులాబీపార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ పుట్టుకే ఓ సంచలనమని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కుల మతాలకతీతంగా పోరాడామని గుర్తు చేసుకున్నారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
BRS Formation Day Celebrations In Hanamkonda :బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లోను నేతలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో జరిగిన వేడుకల్లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచాారి, బండ ప్రకాష్‌లతో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గంగుల:కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. భూమి, నీరు, గాలి ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని గంగుల అన్నారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని ఎగరేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రాష్ట్ర సర్కార్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర విముక్తికోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోందని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.