BRS Leader Vinod Kumar Comments on CM Revanth : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు సంరక్షణ చట్టం తీసుకురావాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా సంరక్షణ చట్టం కోసం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళితే అక్కడ వారిని మునగ చెట్టు ఎక్కిస్తారని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. పోటీ ప్రపంచంలో అవునన్నా కాదన్నా చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మనవలు, మనవరాళ్లను ప్రైవేటు స్కూల్‌కే పంపే పరిస్థితి ఉంటుందన్నారు. తాను ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లను వేరుగా చూడటం లేదన్నారు.
"టీచర్ల మెప్పుకోసం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నేను ఇక్కడ ప్రైవేట్ టీచర్లు, ప్రభుత్వం ఉపాధ్యాయులు అని వ్యత్యాసం చూడటం లేదు. ప్రైవేట్ విద్యాసంస్ధల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ మిత్రులే కాదు. కేజీ టూ పీజీ వరకు ఉన్న అన్ని విద్యారంగ సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది కోసం ఒక చట్టం తీసుకురావాలి."-వినోద్ కుమార్, మాజీ ఎంపీ