తెలంగాణ

telangana

ETV Bharat / politics

'గోల్​మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్​పై బీఆర్​ఎస్​ విమర్శలు - కాంగ్రెస్​పై బీఆర్​ఎస్​ నేతలు ఫైర్​

BRS Comments On CM Revanth Reddy : లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌పై వాక్బాణాలు సంధిస్తోంది. ఓవైపు కేటీఆర్‌, మరోవైపు హరీశ్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేస్తున్న విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

Harish Rao Fires on CM Revanth Reddy
KTR and Harish Rao Comments On CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 8:08 AM IST

Updated : Mar 7, 2024, 8:14 AM IST

'గోల్​మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్​పై బీఆర్​ఎస్​ విమర్శలు

BRS Comments On CM Revanth Reddy :గోల్ మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా సీఎంను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మలేదని, రాష్ట్రంపై గౌరవం అంతకన్నా లేదని కేటీఆర్ ఆరోపించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని మండిపడ్డారు. ఘనమైన గంగా జమునా తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. నిన్నటి దాకా గుజరాత్ మోడల్​పై నిప్పులు, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా అని అడిగారు.

KTR On CM Revanth :తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా అని, సమగ్ర అభివృద్ధికి చిరునామా అని కేటీఆర్‌ వెల్లడించారు. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించపరుస్తారా? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన అంటూ కేటీఆర్ ఘాటు విమర్శలు సంధించారు. తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోదన్నారు. నాడు రాష్ట్ర ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది బీఆర్​ఎస్(BRS)​ అని, నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు.

Harish Rao Comments On CM Revanth : 100 రోజుల పాలన చూసి ఓటు వేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏకీభవిస్తున్నామని, మాట తప్పి, మోసం చేసిన కాంగ్రెస్‌పై ప్రజలు నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు(Harish Rao)కోరారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, 100 రోజుల పాలనలో ఏముందని ప్రశ్నించారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అనుకుంటూ మోదీకి కాషాయం పేపర్‌పై ప్రేమలేఖ రాశారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారన్న మాజీ మంత్రి, మళ్లీ మోదీ ప్రధాని అవుతారు అన్నట్లు కాంగ్రెస్ సీఎం మాట్లాడారని అన్నారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ అంటే, రేవంత్ కావాలని అంటున్నారన్న ఆయన, మూడు నెలలుగా ప్రజలను, సొంత పార్టీని మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నేను గదిలో ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేదు - నిండు సభలో అడిగాను : సీఎం రేవంత్​

రాహుల్, సోనియా కంటే మోదీ ఆశీర్వాదం కోసం ఎక్కువగా రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు ఉందని హరీశ్‌ రావు ఆరోపించారు. వంద రోజుల్లో చేస్తామన్న హామీల (Congress Six Guarantees)ను పూర్తి చేస్తేనే కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు ఉంటుందని వివరించారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాట తప్పిందని, వరికి బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తామని నోటరీ మీద రాసి ఎగ్గొట్టినందుకు ఎవరిపై కేసులు పెట్టాలని ప్రశ్నించారు. నెలకు రూ. 2500 ఇస్తామని, మహిళలను మహాలక్ష్ములను చేస్తామని మాట తప్పినందుకు మహిళలు నిర్ణయం తీసుకోవాలని, నిరుద్యోగ భృతి విషయంలో మోసం చేసినందుకు నిరుద్యోగులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మూడు నెలల్లో రూ. 16 వేల కోట్ల అప్పులు : దళిత బంధు రద్దు చేసినందుకు దళితులు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌పై అక్కా చెల్లెళ్లు నిర్ణయం తీసుకోవాలని హరీశ్​ రావు అన్నారు. అప్పుల విషయంలో తమపై బురద జల్లి మూడు నెలల్లో రూ. 16 వేల కోట్ల అప్పులు తీసుకున్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వం, అదనపు అప్పుల కోసం మళ్లీ ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోంటే, బీజేపీ, బీఆర్​ఎస్ ​మధ్య అవగాహన ఉందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని హరీశ్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌ను రాష్ట్ర, కర్ణాటక బీజేపీ నేతలు మెచ్చుకుంటుుంటే, కాంగ్రెస్ నేతలు తెల్లబోతున్నారని విమర్శించారు.

మేమిచ్చిన ఉద్యోగాలకు వాళ్ల పేర్లు :తాము చేపట్టిన ఉద్యోగాల నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఇస్తున్నారని, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారని మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారన్న ఆయన, పీసీసీ అధ్యక్షుడిగా ఉండి 21 వేల ఉపాధ్యాయ పోస్టులు నింపాలని, ఇప్పుడు 11 వేలకు నోటిఫికేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు పూర్తి చేసి మాట నిలుపుకోవాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని వివరించారు. పేదల ఆరోగ్య ఖర్చులకు సంబంధించిన సీఎంఆర్​ఎఫ్​(CMRF) బిల్లులు కూడా ఆపితే ఎలా అన్న ఆయన, తమపై కక్ష తీర్చుకునేందుకు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

కాంగ్రెస్‌ వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్‌ చేస్తోంది - వారికి ఏం చేతకాదు : కేటీఆర్​

Last Updated : Mar 7, 2024, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details