రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు కాంగ్రెస్ కమీషన్లు అడుగుతోంది : కేసీఆర్ BRS Chief KCR Road Show At Hanamkonda :తెలంగాణలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా, కాంగ్రెస్ నేతలు కమీషన్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్‌కు మద్దతుగా, కేసీఆర్ హనుమకొండలో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గులాబీ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు క్షేమం అని, తెలంగాణ ప్రజల తరఫున పోరాడే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలన్న కేసీఆర్, ఉపముఖ్యమంత్రి, ఎంపీని చేస్తే, ఆయన పార్టీ మారారని దుయ్యబట్టారు. కడియం రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నారని విమర్శించారు. మరో మూడు నెలల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఉపఎన్నిక వస్తుందని, మళ్లీ రాజయ్య ఎమ్మెల్యే అవుతారని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణ ప్రజలకు మళ్లీ గోస వచ్చిందని గుర్తు చేశారు.
"తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగాయి. రియల్ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుండేది. ఆ రంగంపై ఆధారపడి జీవనం సాగించిన వేలమంది ఈరోజు రోడ్లపై పడ్డారు. ఇక్కడ ఉన్న ఈ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం అనుమతులు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? ఎవరైనా బిల్డర్ బిల్డింగ్ కడితే చదరపు అడుగుకు ఇంత అని కమీషన్లు అడుగుతున్నారు. దానికోసం మొత్తం అభివృద్ధిని ఆపివేసి అనుమతులు ఇవ్వడం లేదు" -కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ అధినేత
KCR Fires on BJP :బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యిందని కేసీఆర్ అన్నారు. గోదావరి నీళ్లు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు కమలం పార్టీ కుట్ర చేస్తోందన్న ఆయన, నదుల అనుసంధానంపేరిట గోదావరి నీళ్లు తీసుకుపోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు జీవనాధారమైన గోదావరిని కావేరి నదికి అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవట్లేదని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.
మోదీకి 200 ఎంపీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు : భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే ఆ పార్టీ అజెండా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ అజెండాలో ప్రజల కష్టసుఖాల గురించి ఎప్పుడూ ఉండదన్నారు. పదేళ్ల కాలంలో మోదీ వందల కొద్దీ నినాదాలు ఇచ్చారన్న ఆయన, అమృత్ కాల్ వచ్చిందా, అచ్చే దిన్ వచ్చిందా అని ప్రశ్నించారు. నల్లధనం తెచ్చి అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్నారు హామీ ఏమైందని కేసీఆర్ అడిగారు. రానున్న ఎన్నికల్లో మోదీకి 200 ఎంపీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, గోదావరి ఎత్తుకుపోతామనే బీజేపీకు ఓటు వేయొద్దని కేసీఆర్ సూచించారు.
"రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్‌కు ఇప్పుడు పంచాయతీ వచ్చింది - ప్రజల తరఫున కొట్లాడేందుకు కేసీఆర్‌ను గెలిపించాలి" - KCR Bus Yatra in Nagarkurnool
బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉంది : కేటీఆర్ - KTR ON BJP RESERVATION COMMENTS