తెలంగాణ

telangana

ETV Bharat / politics

నేను అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు - నా అరెస్టుకూ మోదీ కుట్ర : కేసీఆర్ - EX CM KCR Interview - EX CM KCR INTERVIEW

BRS Chief KCR Interview : పదేళ్ల పాలనలో అద్భుతాలు సృష్టించామని, కానీ ఐదు నెలల పాలనకే కాంగ్రెస్​ ప్రజలను రాచిరంపాన పెడుతోందని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ దుయ్యబట్టారు. తాను ఎక్కడా అవినీతి చేయలేదు కనుకనే బీజేపీ వాళ్లకు దొరకలేదన్నారు. మోదీ వికృతరూపానికి నిదర్శనం దిల్లీ మద్యం కేసు అని అందులో కవితను ఇరికించారని ఆవేదన చెందారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీఆర్​ఎస్​కు అనుకూలంగా ఉండి తెలంగాణలో అనిశ్చితి వస్తుందన్నారు. అందుకే బీఆర్​ఎస్​నే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెబుతున్న కేసీఆర్​తో ఈనాడు-ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ.

BRS Chief KCR Interview
BRS Chief KCR Interview (etv bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 7:20 AM IST

Updated : May 7, 2024, 9:32 AM IST

నేను అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు - నా అరెస్టుకూ మోదీ కుట్ర : కేసీఆర్ (etv bharat)

BRS Chief KCR Interview With Etv Bharat : మోదీ కంటిలో నలుసులాగా లొంగకుండా ఉన్నాను కనుకే దిల్లీ మద్యం కేసు పేరుతో ఆయన సృష్టించిన భయంకరమైన కుట్ర అని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ధ్వజమెత్తారు. తనను జైల్లో పెట్టడానికి పీఎం చాలా ప్రయత్నాలే చేశారని తెలిపారు. అయితే తానెక్కడా అవినీతికి దారి చూపకపోవడం వల్లే దొరకలేదన్నారు. కేవలం తెలంగాణలో అణచివేయాలనే ధోరణిలో కేసులు పెడతామని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్ని రాచిరంపాన పెడుతోందని కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ 12 లోక్​సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్​ సోమవారం ఈనాడు-ఈటీవీ భారత్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

  • రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రజా స్పందన ఎలా ఉంది? లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. శాసనసభ ఎన్నికలకు, దీనికి మధ్య భారీ తేడా ఉంది. కాంగ్రెస్‌ వాళ్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించారు. అడ్డగోలు వాగ్దానాలు చేశారు. వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు ధోరణి, ప్రభుత్వం పట్ల ఏహ్యభావం కనిపిస్తోంది. తమను మోసం చేశారనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సహజంగా రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం వస్తే ఏ పార్టీకైనా ఎన్నికల తర్వాత ఆరేడు నెలలపాటు హనీమూన్‌ పీరియడ్‌ ఉంటుంది.

కానీ, తెలంగాణలో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వంపై ముందునుంచే ప్రజల్లో తిరుగుబాటు ధోరణి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఏ ఊరికెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్లు పెడుతున్నారు. అది వాళ్ల పార్టీకి ఒకరకమైన ఇబ్బంది కలిగిస్తోంది. ఆయన అతి ప్రవర్తన, జుగుప్సాకరమైన భాష అవే ఇవ్వాళ వాళ్ల పార్టీకి శాపమయ్యాయి. నా అంచనా ప్రకారం కనీసం 12కుపైగా ఎంపీ సీట్లను బీఆర్​ఎస్​ గెల్చుకోబోతోంది.

  • ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు ప్రధానంగా ఏయే అంశాలను తీసుకెళ్తున్నారు?

తెలంగాణను తెచ్చింది బీఆర్​ఎస్​. రాష్ట్రానికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా వీరోచితంగా పోరాడే పార్టీ కూడా ఇదొక్కటే. కృష్ణా నదీ జలాలపై హక్కులను ఈ ముఖ్యమంత్రి చాలా బేలగా కేఆర్‌ఎంబీకి అప్పగించారు. మా హయాంలో కూడా చాలా ఒత్తిడి పెట్టారు. కానీ, ప్రాణం పోయినా హక్కులు అప్పగించబోమని స్పష్టం చేశాం. గోదావరిని తీసుకెళ్తానని మోదీ స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల సందర్భంలో ఒక రాష్ట్ర వనరును తీసుకెళ్లి మరో రాష్ట్రానికిస్తా అంటే ఎవరూ ఊరుకోరు. ప్రజల గుండెలు రగిలిపోతాయి. ఇంత జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించడంలేదు.

మహానది, గోదావరి, కృష్ణా, కావేరిలను కలపాలని ఎప్పుడో 50 ఏళ్ల కిందట మాట్లాడిన మాట. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడెన్‌గా మహానదిని పక్కనబెట్టి కేవలం గోదావరిని తీసుకుపోతామంటున్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకే ఈ రాష్ట్ర హక్కులను కాపాడాలన్నా, నిధులు తేవాలన్నా కేవలం బీఆర్​ఎస్​తోనే సాధ్యం. గత పార్లమెంటు ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. రాష్ట్రానికి గడ్డిపోచంత పనిచేశారా? ఒకాయన ఐదేళ్లుగా కేంద్రమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గానికి రూ.5 పని కూడా చేయలేదు. సికింద్రాబాద్‌ స్థానాన్ని మేం బంపర్‌ మెజారిటీతో గెలవబోతున్నాం.

బీజేపీ ఎంపీలు గెలిచినా చేతులు కట్టుకొని నిలబడతారే తప్ప వారితో ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్‌ కూడా ఇదే బాపతు. ఇండియా కూటమి గెలిచినా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేతులు కట్టుకోవాల్సిందే తప్ప అధిష్ఠానం ముందు మాట్లాడలేరు. కాంగ్రెస్‌ 8 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో మూడో స్థానంలో ఉన్నాయి. నాకు తెలిసి సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లోనూ కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది. కాంగ్రెస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా లేవట్లేదు. లేవదు కూడా. బీఆర్​ఎస్ ఎంపీలు గెలిస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేసి, వారిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేలా చూస్తారు. బీఆర్​ఎస్​నే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష.

  • తమను అధికారంలోంచి దించడానికి బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు కదా?

ఇంతకంటే అధ్వానమైన వాదన ఇంకోటి ఉంటుందా? బీజేపీతో మాకు సంబంధం ఉందనడం హాస్యాస్పదం. ఆడబిడ్డ అని చూడకుండా అప్రజాస్వామికంగా, అరాచకంగా, క్రూరంగా నా కుమార్తెను తీసుకెళ్లి మోదీ జైల్లో పెట్టారు.

  • బీఆర్​ఎస్ సర్కారు రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది?

తెలివితక్కువ, ఎకనామిక్‌ విజ్‌డమ్‌ లేని పిచ్చివాళ్లు చేసే ప్రచారమిది. అత్యంత ధనిక దేశం అమెరికా. అత్యంత అప్పులెక్కువ ఉన్న దేశం కూడా అదే. కారణమేమిటి? దాన్ని అప్పు అనరు. ప్రైవేటుగా కుటుంబం చేసే అప్పులకు, ప్రభుత్వం చేసే అప్పులకు తేడా ఉంటుంది. మేం అప్పు చేసింది రూ.7 లక్షల కోట్లు కానేకాదు. మేము వచ్చేనాటికే రూ.78 వేల కోట్ల అప్పు ఉంది. తదనంతరం మా ప్రభుత్వ హయాంలో తీసుకున్న రూ.3-4 లక్షల కోట్లను వీళ్లు రూ.7 లక్షల కోట్లని, రూ.80 లక్షల కోట్లని అబద్ధాలు చెబుతున్నారు. ప్రతి పైసానూ మేం ప్రజల ప్రగతికి వినియోగించాం.

  • గ్యారంటీల అమలుపై సంయమనం వహించకుండా బీఆర్​ఎస్ తొందర పడుతోందని కాంగ్రెస్‌ అంటోంది?

గ్యారంటీలు అమలుచేయడంపై గడువు తేదీలు పెట్టింది కాంగ్రెస్‌ వాళ్లే. గ్యారంటీలు ఇవ్వకుండా మా ప్రభుత్వం చేసినవి నేనొక వంద చెప్పగలను. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, గురుకులాల స్థాపన, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, వైద్య కళాశాలలు, జిల్లాల పునర్విభజన ఇవేవీ మేము హామీలివ్వలేదు. కానీ, తెలంగాణకు ఏది మంచిదో గ్రహించి మా బాధ్యతగా భావించి చేస్తూ పోయాం. నాలుగైదు మెడికల్‌ కాలేజీలున్న చోట 33 మెడికల్‌ కాలేజీలు తేవడం అద్భుతం కదా. ఇది ఎట్ల విధ్వంసం అవుతుంది?.

కాంగ్రెస్‌ సర్కారు గతంలో కేవలం రూ.200 పింఛన్‌ ఇచ్చింది. మేము వచ్చాక రూ.2 వేలు ఇవ్వడం విధ్వంసమా? ప్రజలకు సంక్షేమం, కరెంటు, సాగునీరు రంగాల్లో చెప్పని అనేక కార్యక్రమాలు చేశాం. రూ.4.5 లక్షల కోట్లున్న తెలంగాణ ఆదాయాన్ని రూ.14.5 లక్షల కోట్లకు పెంచాం. దీన్ని విధ్వంసం అంటామంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. తమ పరిపాలనే ఈ ఎన్నికలకు రెఫరెండం అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తోక ముడిచారు కదా!. వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల్ని రాచిరంపాన పెడుతోంది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో తెలంగాణ దెబ్బతింటోంది. ఈ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు మీ పార్టీని వీడారు. దీన్ని అధిగమించడానికి ఏం చేస్తున్నారు?

కొందరు పనికిమాలినోళ్లే పోయారు. మాకేమీ నష్టం జరగలేదు. పొద్దుతిరుగుడు పూవులాంటోళ్లు వాళ్లు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరతారు. మా పార్టీ అధికారంలోకి రాగానే వచ్చి మా దాంట్లో దూరారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌లో చేరారు. నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీనే. మా పార్టీ నుంచి పరుగెత్తి పోయి ఇతర పార్టీల్లో అభ్యర్థులుగా ఉన్న వాళ్లు అన్ని చోట్లా మూడోస్థానంలో ఉన్నారు. వరంగల్‌లో కాంగ్రెస్‌లోకి పోయినోళ్లు రెండోస్థానంలో ఉన్నారు.

మాది 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ. మా పార్టీ ఉండదని కొందరు చెబుతున్నది నిజమే అయితే పదేళ్లు అధికారంలో లేని కాంగ్రెస్‌ ఎలా బతికింది? వాళ్ల 18 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారు. అయినా ఆ పార్టీ చచ్చిపోలేదు కదా? పార్టీలు ఈ నాయకులతో ఉండవు. మంచి ప్రజా పునాది, కార్యకర్తలతో ఉంటుంది. క్యాడర్‌ చెక్కుచెదరకుండా ఉంది. నా బస్సుయాత్రలో చూస్తున్నారు కదా! 44-45 డిగ్రీల ఎండ ఉన్నా ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు.

  • ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై?

ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం? ఇప్పటి ప్రభుత్వం ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తుందని నేను అనుకోలేదు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామం. సీఎం, మంత్రుల చేతికి రిపోర్ట్‌లు వస్తాయి కానీ, వాళ్లు ట్యాపింగ్‌ చేశారా? లేదా? అనేది మాకేం తెలుస్తుంది? అది మా పరిధిలోకే రాదు. అసలది ఆరోపణే కాదు.

  • లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్ ఉండదు అని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తే ప్రజలు ఆశపడ్డారు. దాంతో నాలుగు ఓట్లు అటు పడ్డాయి. మేము 1.8 శాతం ఓట్లు వెనుకబడ్డాం. అంతేగానీ మాకేం తక్కువ రాలేదు. 1989లో అధికారం కోల్పోయిన ఎన్టీఆర్‌ 1994లో బౌన్స్‌బ్యాక్‌ అయినట్లుగా బీఆర్​ఎస్ తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు 2004లో అధికారం కోల్పోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ పదేళ్లు అధికారంలో లేదు. టీడీపీ పోయిందా? కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లు అధికారంలో లేదు. చచ్చిపోయిందా?. బీఆర్​ఎస్ ఉండదని ఎవరైనా మాట్లాడితే వారి అహంకారానికి, తెలివితక్కువ తనానికి, అజ్ఞానానికి నిదర్శనం. బీఆర్​ఎస్ బ్రహ్మాండంగా మళ్లీ ప్రభుత్వంలోకి వస్తుంది.

  • ప్రాజెక్టుల్లో అవినీతి, భూముల కుంభకోణం తదితర అవినీతి ఆరోపణలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది. విచారణ కమిషన్‌లను నియమించింది. వీటి ప్రభావం ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్పై ఉంటుందా?

ఎన్నికలపై ఆ ప్రభావం ‘జీరో’. ఎందుకంటే పదేళ్లలో నిజంగానే మేం అవినీతికి పాల్పడి ఉంటే అప్పుడే చాలా గందరగోళం జరిగి ఉండేది. ఇప్పుడొచ్చి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి కమిషన్లు వేశారు. కమిషన్లది ఏముంది? ఏ ప్రభుత్వమైనా వంద కమిషన్లు వేయొచ్చు. వాటితో అయ్యేది లేదు తేలేది కూడా ఏమీ లేదు. అసలు అవినీతి చాలా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేంద్ర ప్రభుత్వమే ఎన్నో నివేదికల్లో చెప్పింది. ఇతర సర్వేలు కూడా చెప్పాయి. మేం నిజాయతీగా పనిచేస్తేనే కదా ఈ అభివృద్ధి సాధ్యమైంది. కరెంటు మీద అవినీతి చేశామంటే అంతకంటే హీనమైంది ఇంకోటి ఉండదు. మేము అప్పజెప్పిందంతా ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే కదా దాంట్లో అవినీతికి ఆస్కారమే ఉండదు. మంచీచెడ్డలు, టారిఫ్‌లు చూడ్డానికి రెగ్యులేటరీ కమిషన్లు ఉన్నాయి. అన్నీ ఆ కమిషన్ల నియంత్రణలోనే ఉంటాయి. అయినా అవినీతి అని అన్నారంటే వాళ్లే ప్రజల్లో అభాసుపాలు అవుతారు.

  • రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది?

వాళ్లు ఆ పని చేసినా(రిజర్వేషన్ల రద్దు) చేస్తారు. అందులో అనుమానమేం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త గోల్వల్కర్‌ సిద్ధాంతంలోనే ఇది ఉంది. ఆయనకు మోదీ శిష్యుడే. ‘రాజ్యాంగం మారిస్తే తప్పేంటి?’ అని బీజేపీకు చెందిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు. వాళ్ల పద్ధతి చూస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారన్న అనుమానాలున్నాయి. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. బీజేపీ ఎజెండాలో ప్రజల బాధలు, సమస్యలు, కష్టసుఖాలకు తావుండదు. వాళ్లు ఎంతసేపూ కార్పొరేట్లకు సద్ది కడతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి ఏవీ చేయరు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు మాఫీ చేశారు. అవినీతిపరులందరూ మోదీ పక్కనే ఉన్నారు. బీజేపీకు ఎన్నికల బాండ్లు రాసివ్వగానే వారిపై కేసులు మాఫీ అవుతాయి.

  • ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలుంటాయని మీరు అంచనా వేస్తున్నారు?

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. ఎన్డీయేకు అయితే మెజారిటీ రాదు. మహారాష్ట్ర, బిహార్‌, బెంగాల్‌లలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది. దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి వచ్చే సీట్లు అంతంత మాత్రమే. మొన్నటివరకు కర్ణాటకలో సీట్లు వస్తాయనుకున్నారు కానీ ప్రజ్వల్‌ కుంభకోణంతో భయంకరంగా దెబ్బతిన్నారు. దక్షిణాదిలో బీజేపీకు 10-12 సీట్లు వస్తే ఎక్కువ. ప్రాంతీయ పార్టీల కూటమే కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది.

  • లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏం జరగొచ్చని మీరు ఊహిస్తున్నారు?

సీఎం ప్రవర్తన, అసహనం చూస్తుంటే ఆయనసలు ముఖ్యమంత్రిలాగే మాట్లాడటం లేదనిపిస్తోంది. ఆ హుందాతనం, ఔన్నత్యం లేవు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలే లేవని సమాచారం వస్తోంది. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే ప్రధాన పాత్ర పోషించబోతోంది. అందులో కాంగ్రెస్‌ కూడా ఒక చిన్న పార్టీగా ఉండబోతోంది. ఒకవేళ మోదీనే తిరిగి వచ్చారనుకుందాం. వీళ్లను ఉండనిస్తారా? ఐదేళ్ల కిందట మా పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలున్న సమయంలోనే మా ప్రభుత్వాన్ని కూల్చాలని మోదీ ప్రయత్నం చేశారు. మోదీకి మాతో వైరం ఎందుకంటే మేము వాళ్లను పట్టి బంధించాం ఇక్కడ. వాళ్ల పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను పట్టుకురమ్మని చెప్పి బీజేపీ కేంద్ర కార్యాలయానికి మన రాష్ట్ర పోలీసులను పంపించాం. మాకంత ధైర్యం, సాహసం ఉన్నాయి.

మేము అవినీతి చేసి ఉంటే మోదీకి భయపడి ఉంటే అలా పంపుతామా? ఇదే కదా మా స్వచ్ఛతకు నిదర్శనం. ఇది మనసులో పెట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మా మీద కక్ష కట్టాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్లు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. మనమిద్దరం ఒక్కటైతే తప్ప కేసీఆర్‌ను ఓడించలేమని నిర్ణయానికొచ్చి కాంగ్రెస్‌, బీజేపీలు చాలాచోట్ల కుమ్మక్కయ్యాయి. అంతకుముందు ఉప ఎన్నికల్లోనూ పరోక్షంగా జట్టుకట్టాయి. ఈ మధ్య జరుగుతున్న పురపాలక అవిశ్వాసాల్లోనూ ఛైర్మన్‌ కాంగ్రెస్‌, వైస్‌ ఛైర్మన్‌ బీజేపీ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కళ్లకు కనబడుతున్నాయి.

మోదీ వైఖరి, వాళ్లలో విపరీతంగా పెరిగిపోయిన రాజ్యకాంక్ష.. ఇవన్నీ చూస్తే తప్పకుండా రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఉండనీయరు. జరగబోయే పరిణామాలను ఊహించిన కొందరు కాంగ్రెస్‌ వాళ్లు మావాళ్లతో మాట్లాడుతున్నారు. ‘అలాంటి పరిస్థితే వస్తే మేము కూడా రెడీగానే ఉన్నాం. మనం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేద్దాం’ అనే మాటలు కూడా బాహాటంగానే మాట్లాడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తప్పకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి రాబోతోంది. అప్పుడు మేం సందర్భోచిత నిర్ణయం తీసుకుంటాం.

  • మేడిగడ్డ పియర్స్‌ కుంగడంపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలపై?

కాళేశ్వరం గురించి వాళ్లకు పరిజ్ఞానమే లేదు. అందులో ఏదో జరిగిపోయింది కేసీఆర్‌ని అపఖ్యాతి పాలుజేద్దామన్న పిచ్చి భ్రమలో ఉన్నారు. కానీ, అందులో ఏమీలేదు. ఏమీ తేలదు. ఈ మధ్యనే గంగానదిపై ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రిడ్జి కడుతుంటే కూలిపోయింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కడుతుంటే కుడివైపు కుంగిపోయింది. మళ్లీ కట్టుకున్నాం కదా? భారీ సాగునీటి ప్రాజెక్టులను భారీ వరద ఉండే నదులపై కట్టినప్పుడు చిన్నచిన్న సమస్యలు రావడం అత్యంత సహజ పరిమాణం. కానీ, వీళ్లు సిల్లీగా ‘కేసీఆర్‌ను బద్నాం చేద్దాం ఏదైనా దొరుకుతుందేమో’ అన్న దురుద్దేశంతో న్యాయవిచారణ పెట్టారు.

ఏ రకమైన విచారణైనా చేసుకోండి. మాకే మీ ఇబ్బంది లేదు. కాళేశ్వరంలో 70-80 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టి చాలా పెద్ద అప్రతిష్ఠను కాంగ్రెస్‌ పార్టీ మూటగట్టుకుంది. వీళ్లు చెరువులు నింపలేదు. చెక్‌డ్యాంలు నింపలేదు. లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఎండాయి. ఆ తేడా కూడా స్పష్టంగా తెలిసిపోయింది. ఆ ఆక్రోశాన్ని పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు చూపించబోతున్నారు.

మోదీ పాలనను వ్యతిరేకించినందుకే కవితను జైలులో పెట్టారు : కేసీఆర్‌ - KCR bus trip in Nizamabad

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసే మళ్లీ పోరాటానికి బయలుదేరాను : కేసీఆర్​ - Ex CM KCR Election Campaign

Last Updated : May 7, 2024, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details