BRS Chalo Medigadda Tour : కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లో కొన్ని పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కొన్ని పిల్లర్లు కుంగిపోతే, ప్రాజెక్టు మొత్తం పోయినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డకు సీఎం బృందం వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటన వార్తల్లో రాకూడదనే కాంగ్రెస్ పోటీ యాత్రలు పెట్టిందని ధ్వజమెత్తారు. తాము వాస్తవాలు చెప్పేందుకు బయలుదేరినప్పుడే పోటీ కార్యక్రమాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాలపై నల్గొండ సభకు వెళ్లిన రోజే మేడిగడ్డ పర్యటన చేపట్టారని, తాము మేడిగడ్డకు వస్తుంటే పాలమూరు పర్యటన చేపట్టారని ధ్వజమెత్తారు.
'చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు' - మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు
చలో మేడిగడ్డలో భాగంగా ముందుగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన బీఆర్ఎస్ నేతల బృందం, ఆ తర్వాత అన్నారం బ్యారేజీని సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు అని ఆయన వివరించారు. కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని అంటున్నారన్న ఆయన, కేంద్ర జల వనరుల సంఘం నుంచి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు పొందామని స్పష్టం చేశారు.