BJP MP Raghunandan Rao on CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్నది ఏడో తరగతని, ఆయన చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కొంచెం చదువుకున్నోళ్లను పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. మెదక్‌లోని బీజేపీ కార్యాలయంలో శనివారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేతో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర బడ్జెట్లోని అంశాలను వివరించారు.
తెలంగాణకు కేంద్రం రెండు పథకాల కింద రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని రఘునందన్ రావు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. దీన్ని ఆధారంగా బడ్జెట్‌పై సీఎం రేవంత్‌కు ఎంత అవగాహన ఉందో అద్దం పడుతోందన్నారు. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి ఇస్తారే తప్ప వేరేది కాదని ఆరోపించారు.
'రేవంత్‌రెడ్డి చదువుకున్నది ఏడో తరగతి. చేసే పని గోడలకు వేసే సున్నం. అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్లో ఏం వచ్చిందో తెలుస్తుంది. కేంద్రమంత్రి రాందాస్ అథావాలే తెలంగాణకు ఏ పథకాల్లో ఎన్ని నిధులు వచ్చాయో వివరించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో 4వపేజీలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు రెండు పథకాల కింద రూ.50 వేల కోట్లు నిధులు వస్తున్నట్లు ఉంది' - రఘునందన్ రావు, మెదక్ ఎంపీ