BJP MP Laxman on Phone Tapping Case : కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య నాటకీయ ఫక్కీలో ఆడుతున్న డ్రామాగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే తమను ఎదుర్కొలేక వారు ఒక్కరినొక్కరు తిట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధరణి మీద విచారణ కోసం కమిటీ వేశారని, కానీ అది అతీగతీ లేదని ఆక్షేపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు ఖాయం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్
MP Laxman Fires on Congress and BRS :ఫోన్ ట్యాపింగ్ ( TS Phone Tapping Case)కేసు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని లక్ష్మణ్ అన్నారు. సూత్రధారులను పరిగణలోకి తీసుకోకుండా అసలు దోషులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని విమర్శించారు. వ్యక్తుల భద్రత, స్వేచ్ఛను హరించేలా ఈ తతంగం జరిగిందని దుయ్యబట్టారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని లక్ష్మణ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఎండగట్టమే లక్ష్యంగా బీజేపీ యాత్రలు : ఎంపీ లక్ష్మణ్
సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ ప్రయోజనాలు పొందిందని లక్ష్మణ్ ఆరోపించారు. అధికార పార్టీ అభ్యర్థులకు పోలీస్ వాహనాల్లో డబ్బులు పంపిణీ చేయడం దుర్మార్గమని అన్నారు. ఎన్నికల కమిషన్‌ను గత ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.