BJP Leader Kishan Reddy on MP election Campaign : జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధానిగా ఉండాలనేది నిర్ణయించబోతున్నాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు, అయిన తర్వాత దేశంలో పాలన ఎలా ఉందో అందరూ ఆలోచించాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్‌పేట్‌లోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన, బస్తీ ప్రజలతో ముచ్చటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ మోదీ (PM Modi) నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో అనేక సమస్యలను పరిష్కరించిన ప్రధాని మోదీ, కరోనా వంటి విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడారని కొనియాడారు.
Kishan Reddy about PM Narendra Modi : ఆ సమయంలో అందరికీ ప్రధాని మోదీ ధైర్యం ఇచ్చారని, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను ప్రోత్సహించి అందరికీ ఉచితంగా అందించారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉచితంగా బియ్యం అందించారని, ఇంకా బియ్యం పంపిణీ కొనసాగుతోందని అన్నారు. తనపై నమ్మకంతో తనని ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పని చేసే అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మోదీతో దేశ అభివృద్ధికి సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.760 కోట్లతో ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని, అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ను కూడా ఆధునీకరిస్తున్నామని గుర్తు చేశారు.
వేల కోట్లతో అభివృద్ధి నిర్మాణాలు :ఆర్ఆర్ఆర్(RRR)ను రూ.26 వేల కోట్లతో నిర్మాణానికి కృషి చేస్తున్నామని, రోడ్డు పనులు పూర్తి అయితే అనేక కంపెనీలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు లభిస్తాయి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్కులు, కమ్యూనిటీ హాల్స్‌ను నిర్మించామని, మహిళలకు స్వయం ఉపాధి పొందడం కోసం శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్‌పేటలో అనేక స్కూళ్లను నిర్మించి పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. అంబర్‌పేట్ బిడ్డగా తనను మరోసారి భారీ మెజార్టీ గెలిపించాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.