Bpcl Oil refinery : భారత్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ రాష్ట్రానికి రావడం ఖాయమేనని తెలుస్తోంది. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలం, వాతావరణంతో పాటు విభజన హామీల్లోనూ అప్పటి ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రస్థావించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశ్రమను రాష్ట్రానికి రప్పించాలని అధికారులు గట్టి పట్టుదలతో ఉన్నారు. సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే ఓ సారి సంప్రదింపులు జరిపిన అధికారులు.. యాజమాన్యం కోరిన అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు. కంపెనీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఓ వైపు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా మరోవైపు మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషవ్ వారితో మాట్లాడి మచిలీపట్నంకు ఆయిల్ రిఫైనరీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. 4-5వేల ఎకరాలను ఇండస్ట్రియల్ హబ్ గా రూపొందించి అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని యేడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును సాధించేందుకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బీపీసీఎల్ దాదాపు రూ.50వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. పరిశ్రమ ఏర్పాటుతో వేల మందికి స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. వాటిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదనలు ముందుంచారు. ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడుతుండగా ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్‌లో బీపీసీఎల్ రిఫైనరీలు కొనసాగుతున్నాయి. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తున్న తరుణంలో తీరప్రాంతం అనువైనదని ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు.