Pawan Kalyan Announces Financial Assistance: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు రామ్ చరణ్, నిర్మాత దిల్‌రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు.
జనసేన తరుపున ఆర్థికసాయం: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఏడీబీ రోడ్డుపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కాకినాడ–రాజమహేంద్రవరం వెళ్లే ఏడీబీ రహదారి విస్తరణను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని ఈ దశలో ప్రమదాం జరగడం బాధాకరమన్నారు.
ఇళ్లకు సురక్షితంగా వెళ్లండి అని ఆరోజు వేడుకలో ఒకటికి, రెండుసార్లు చెప్పానని కాని ఇలా జరగడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని అలానే ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని, తన కార్యాలయ అధికారులకు ఆదేశారు జారీ చేశారు. ఇకపై పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్(X)లో ట్వీట్ చేశారు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…
రామ్ చరణ్, దిల్‌రాజు సంతాపం: ఇద్దరు అభిమానుల మృతికి రామ్‌చరణ్ సంతాపం తెలిపారు. చనిపోయిన ఆ ఇద్దరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఈవెంట్ తర్వాత ఇద్దరు మృతి చెందడం బాధాకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈవెంట్ తర్వాత ఇద్దరి మరణం తెలిసి చాలా బాధ పడుతున్నానని తెలిపారు. బాధిత కుటుంబాలను తనా వంతుగా ఆదుకుంటానని అన్నారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు అందిస్తానని దిల్ రాజు అన్నారు.
'పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ నా అచీవ్మెంట్స్- నేను సాధించింది అదే'- మెగాస్టార్
ఇదీ జరిగింది: రాజమహేంద్రవరం శివారులో జరిగిన గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు కాకినాడ జిల్లాకు చెందిన నలుగురు అభిమానులు అరవ మణికంఠ(23), తోకాడ చరణ్(22), ఎన్.శశిశ్రీ, ఎస్.స్వామి వెళ్లారు. కొంతసేపు చూసిన తర్వాత జనం రద్దీ కారణంగా నలుగురూ వెనుదిరిగారు. రంగంపేట-వడిశలేరు మధ్య ఏడీబీ రోడ్డుపై మణికంఠ, చరణ్‌లు వస్తున్న వాహనాన్ని వ్యాన్ ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన వీరిని స్నేహితులు 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతి చెందాడు. తీవ్రగాయాలతో ఉన్న చరణ్‌ను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చరణ్ శనివారం మృతి చెందాడు. శశిశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రంగంపేట ఎస్సై తోట కృష్ణసాయి తెలిపారు.
ఆధారం కోల్పోయిన కుటుంబాలు: కాకినాడ జిల్లా గైగోలుపాడుకి చెందిన మణికంఠ తండ్రిని కోల్పోవడంతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఓ వైపు ప్రైవేట్‌గా బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అక్క లలితాదేవికి వివాహం చేయడంతోపాటు తల్లి భవానికి అన్నీ తానై నిలిస్తున్నాడు. చదువు పూర్తయిన తర్వాత భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చుదిద్దుకోవాలని ఆశపడిన అతను మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నిరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడలోని అశోక్‌నగర్‌కు చెందిన అప్పారావు, లావణ్యకుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు చరణ్ సంతానం. డిగ్రీ పూర్తి చేసి చరణ్ ఉదోగ్యప్రయత్నాల్లో ఉన్నాడు. తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.
కాకినాడలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి - విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం
'ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకా టైమ్ ఉంది- థియేటర్లో అల్లాడిద్దాం'- OG మేకర్స్