YSRCP BC Leaders Fire On Jagan : సామాజిక న్యాయం పాలక పక్షాల ఊత పదం. బడుగు, బలహీన వర్గాలకు అందని ద్రాక్షలా మారిన సామాజిక న్యాయం ఎన్నికల వేళ ఓట్లు దండుకునేందుకు మంత్రదండంలా మారుతోంది. ఐదేళ్లుగా అణగారిన వర్గాల సంక్షేమమే పట్టని జగన్ ఉన్నట్టుండి మరో ఊబిని సిద్ధం చేస్తున్నారు. పదవులు ఎరవేసి రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకోజూస్తున్నారు. బీసీలు మెరుగుపడ్డారంటున్నారే తప్ప వైఎస్సార్సీపీ ఐదేళ్ల నియంతృత్వ పాలనలో మరుగునపడ్డారనే వాస్తవాన్ని దాచేసే ప్రయత్నం చేస్తున్నారు.
బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'
నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో జగన్ రెడ్డి సామాజిక న్యాయం కూడా అంతే నిజం. 'నోటితో నవ్వడం, నొసటితో వెక్కిరించడం' అన్నట్లు బీసీలకు పదవులు ఇచ్చామని చెప్పుకొన్న జగన్ వారికి తగిన గౌరవం, ప్రొటోకాల్ (protocol) ఇవ్వనేలేదన్నది వాస్తవం. 'ఎప్పుడూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పల్లవి అందుకునే సీఎం ఈ ఐదేళ్లలో వారికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ (Tadepalli Camp Office) గడప తొక్కే అవకాశం కల్పించారా? పైగా బీసీల నిధులను 34వేల కోట్లు దారి మళ్లించారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత పెట్టి 16,800 రాజ్యాంగ పదవుల నుంచి బీసీలను దూరం చేశారు. బీసీలకే చెందిన 8వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారు.' ఈ ఆరోపణలు చేస్తోంది ప్రతిపక్ష టీడీపీ కాదు. సాక్షాత్తు ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చిన బీసీ నేతలే వేలెత్తి చూపుతున్నారు.
'బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు - ఖర్చు పెట్టడానికి నిధులు లేవు '
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదరణ పథకం, విదేశీ విద్య, పెళ్లి కానుకను సైతం రద్దు చేశారని, జీవో నెంబర్ 217తో మత్స్యకారులను తీవ్రంగా దెబ్బతీశారని మండిపడుతున్నారు. ఎన్‌హెచ్‌డీపీ పథకాలను రద్దు చేసి చేనేత కార్మికులకు తీరని ద్రోహం చేశారని, పవర్ లేని పదవులు, ఛైర్మన్లు లేని కార్పొరేషన్లు, పేద విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు వీలైన సహాయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెన్నెముక కులాలంటూ కబుర్లు, ఐదేళ్లుగా దెబ్బమీద దెబ్బలు- బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్
జగన్ మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఎక్కువైంది. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు సరైన న్యాయం జరగలేదు. జగన్ ఎప్పడూ నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీలని మాట్లాడుతున్నారే తప్ప వారి మనోభావాలతో ఆయనకు పనిలేదు. తాత్కాలికంగా కొన్ని పదవులు ఇచ్చి, వారికి సామాజిక న్యాయం చేసేశామనడం పెద్ద మోసం. - జంగా కృష్ణమూర్తి, బీసీ నేత
బీసీ డిక్లరేషన్‌తో వైసీపీలో వణుకు :వెనుకబడిన వర్గాలే పునాదిగా పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ తొలి ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారం దక్కించుని సరికొత్త చరిత్ర లిఖించింది. తెలుగుదేశం రాకతో బీసీలకు రాజకీయ వేదిక లభించింది. నాటి ఎన్టీఆర్ మొదలుకుని నేడు చంద్రబాబు నాయకత్వంలో ఎంతో మంది బీసీ నేతలు పదవులకు వన్నె తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ-జనసేన ఉమ్మడిగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకుంది. 'జయహా బీసీ' సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ వైఎస్సార్సీపీ నేతల్లో వణుకు పుట్టించింది. వచ్చే ఎన్నికల్లో సగం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అనేందుకు కారణమైంది అనడంలో సందేహం లేదని బీసీ నేతలు పేర్కొంటున్నారు. వైసీపీ ఎత్తగడలకు మరోసారి మోసపోయేది లేదని చెప్తున్నారు.
బీసీలకు అండ దండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 'డిక్లరేషన్'