Editorial on MLA YS Jaganmohan Reddy: చట్టసభల సభ్యులంటే శాసన నిర్మాతలు. జనజీవితాలను ప్రభావితం చేసే చట్టాలను రూపొందించేవారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు ఏదైనా శాసనంగా మారాలంటే చట్టసభ సభ్యులు అంగీకరించాలి. సంబంధిత బిల్లును ఆమూలాగ్రం నిశితంగా పరిశీలించి దాని లాభనష్టాలపై సభ్యులందరూ చర్చించిన తరవాతే ఒక అంగీకారానికి రావాలి. అప్పుడే లోపరహితమైన చట్టాలు ప్రాణం పోసుకోగలవు. అలా జరగాలంటే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు తగినన్ని రోజుల పాటు కొలువుతీరాలి.
ప్రజోపయోగ అంశాలపై చర్చలతో వాటి భేటీలు సద్వినియోగం కావాలి. కానీ మన దేశంలో కాలం గడిచే కొద్దీ చట్టసభలు సమావేశమయ్యే రోజుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రజల బాగోగులతో నిమిత్తం లేని రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు, నిరవధిక నిరసనలతో ఉన్న కొద్దిపాటి సభా సమయమూ హరించుకుపోతోంది. అధికార, విపక్షాలు కలిసికట్టుగా ప్రజాప్రయోజనాలను నెరవేర్చాల్సిన తరుణంలో తాము అసలు అసెంబ్లీకి వెళ్లేది లేదని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెగేసి చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. జనతంత్ర విలువలకు గోరీకట్టడంలో జగన్ ఎంతగా ఆరితేరిపోయారనే దానికి ఇదో నిదర్శనం.
జగన్ మూర్ఖంగా మంకుపట్టు: ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే శాసనసభలో అడుగుపెడతానన్నది జగన్ పంతం. చట్టసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం సీట్లు కలిగిన విపక్ష పార్టీ నేతకే ఆ గుర్తింపు ఇవ్వాలన్నది నియమం. మొదటి లోక్‌సభ స్పీకర్ జివి మవులాంకర్ విధించిన ఈ నిబంధన 7 దశాబ్దాలుగా యావద్దేశం అమలవుతోంది. అందుకే 1969 వరకు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు(ఎల్‌వోపీ) అంటూ ఎవరూ లేరు. ఆ తరవాత 5, 7, 8వ లోక్‌సభలలోనూ ఆ హోదా ఎవరికీ దక్కలేదు.
2014-2024 మధ్యలోనూ అదే పరిస్థితి. లోక్‌సభలో 10 శాతం సీట్లు లేకపోయినా తమకు 'ఎల్‌వోపీ' ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ వినతిని 2014లో నాటి స్పీకర్ తిరస్కరించారు. ప్రధాన ప్రతిపక్షమనే గుర్తింపును కాంగ్రెస్‌కు ఎందుకు ఇవ్వరాదో చెబుతూ అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహత్గీ లోక్‌సభకు తన అభిప్రాయాన్ని సవివరంగా తెలియజేశారు. అంటే 'ఎల్‌వోపీ' హోదా ఇవ్వాల్సింది ప్రజలే కదా. వాళ్లు ఇవ్వని దానికోసం జగన్ మూర్ఖంగా మంకుపట్టు పడుతున్నారు.
నెయ్యిలో రసాయనాలు కలిపా - సిట్ విచారణలో అపూర్వ చావడా!
హైకోర్టుకూ వెళ్లిన జగన్: 'చంద్రబాబుకు 23 మంది సభ్యులున్నారు. అయిదుగురిని లాగేస్తే 17/18 మంది అవుతారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు' అంటూ 2019 జూన్ 13వ తేదీన సీఎంగా నిండు శాసనసభలో మూర్తీభవించిన దురహంకారంతో మాట్లాడారు జగన్. ప్రజాస్వామ్యం పట్ల ఆయన లెక్కలేనితనానికి తార్కాణమది. కాలం తిరగబడి సంఖ్యాబలం అంతా ఊడ్చుకుపోయాక కూడా 'ఎల్‌వోపీ' కావాలంటూ స్పీకర్‌కు లేఖరాసిన జగన్ దానికోసమే హైకోర్టుకూ వెళ్లారు. ఆ వ్యాజ్యం పరిష్కారమయ్యే వరకైనా శాసనసభకు వచ్చే ఓపిక పులివెందుల ఎమ్మెల్యేకు లేదా? మవులాంకర్ నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని 2014లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది.
అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా జగన్ ఎందుకు తప్పించుకుని పారిపోతున్నారు? 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే తన సభ్యత్వం రద్దవుతుంది కాబట్టి మొన్న మొక్కుబడిగా అక్కడికి వెళ్లి సంతకం పెట్టి నిమిషాల్లో వెనుదిరిగారు ఆయన. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్లు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలెవరూ సభకు వెళ్లాల్సిన అవసరం లేదని జగనే ఏకపక్షంగా తేల్చేశారు. ఇది ఆయన అప్రజాస్వామిక పెత్తందారీ పోకడలకు పరాకాష్ట. తమకు 40శాతం ఓట్లు పడ్డాయని చెప్పుకొనే జగన్ అంతమంది తరఫున శాసనసభలో ఎందుకు మాట్లాడరు? ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రయత్నించని వ్యక్తి నాయకుడిగా ఎలా పనికొస్తారు?
మండలిలో కూటమి Vs వైఎస్సార్సీపీ - సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాడీవేడీ చర్చ
వల్లభనేని వంశీ భూకబ్జాలపై సిట్ దర్యాప్తు వేగవంతం - మరో 2 కేసులు నమోదు