Babu Mohan Resigns From BJP :ప్రముఖ సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్(Babu Mohan) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ(BJP) పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పొమ్మనకుండా పొగ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేశానని బాబుమోహన్ తెలిపారు. పార్టీ గెలుపునకు ఎంతో శ్రమించానని చెప్పారు. పార్టీలో ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా తనను డీ క్యాటగిరిగా నిర్ణయించడం సమంజసం కాదన్నారు. తనను డీ కేటగిరీ కింద నిర్ణయించడానికి రాష్ట్ర నాయకులకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు.
"నేను బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదు. పార్టీ బలోపేతానికి ఎంతగానో శ్రమించినప్పటికీ పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రనేతలను ఏబీసీడీ క్యాటగిరీలుగా విభజించి, నన్ను డీ కేటగిరీలో చేర్చారు. పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారు. వరంగల్ ఎంపీగా ప్రజలకు సేవలందిచాలని నిర్ణయించుకున్నాను". - బాబు మోహన్, మాజీమంత్రి, సీనినటుడు
తనను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందని బాబు మోహన్ తెలిపారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతూ ఫోన్ సైతం ఎత్తడం లేదని తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబు మోహన్ స్పష్టం చేశారు.