Arrangements Completed for TDP, Janasena and BJP Meeting:పల్నాడు జిల్లా బొప్పూడిలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాగళం సభకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రధానిమంత్రికి ఉండే ప్రొటోకాల్ నిబంధనల్ని అనుసరించి సభా ప్రదేశంలో భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర పోలీసులతో పాటు ప్రధాని భద్రతా సిబ్బంది మూడు రోజుల నుంచి సభా ప్రాంగణంలో ఉండి బందోబస్తుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ తదితరులు ఉండి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన సాయంత్రం 5.15 గంటలకు నేరుగా సభా ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వస్తారు. సభ వద్ద గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు నేతృత్వంలో మొత్తం 14 మంది ఐపీఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు.
ఏపీలో టీడీపీ కూటమిదే విజయం - తెలంగాణలో కాంగ్రెస్ హవా!
రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు:భారీ బహిరంగ సభ దృష్ట్యా పోలీసు అధికారులు రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై నుంచి కోలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారిపై గుంటూరు మీదగా విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు-దిగమర్రు రహదారిపైకి మళ్లించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. కోలకత్తా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు విశాఖపట్నం, మచిలీపట్నం, రేపల్లె, చీరాల, ఒంగోలు మీదగా చెన్నైకి చేరుకోవాలి. కోలకతా వైపు వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం, మైలవరం, హనుమాన్ జంక్షన్, విశాఖ మీదగా వెళ్లాలి.
ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడ వైపు ఎన్‌హెచ్-16 పైగా వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదగా గుంటూరు చేరుకోవాలని అధికారులు స్పష్టంచేశారు. ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడ వైపు ఎన్‌హెచ్-16పైగా వెళ్లాల్సిన వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి, సంతమాగులూరు, నరసరావుపేట బైపాస్, ఫిరంగిపురం, పేరేచర్ల మీదగా గుంటూరు, విజయవాడ తరలించనున్నారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై చిలకలూరిపేట నుంచి మేదరమెట్ల హైవే వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని, ఈ మార్గంలో కేవలం ప్రజాగళం సభా ప్రాంగణానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.