ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్‌ - AP GOVERNOR SPEECH IN ASSEMBLY

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ - తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడి

GOVERNOR SPEECH
GOVERNOR SPEECH (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 11:20 AM IST

Updated : Feb 24, 2025, 12:17 PM IST

AP GOVERNOR SPEECH IN ASSEMBLY: ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్న గవర్నర్‌, అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు.

తలసరి ఆదాయం పెరిగింది: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్‌, తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని వెల్లడించారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్న గవర్నర్‌, బీసీవర్గాలు సమాజానికి వెన్నెముక అని వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.

"ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్‌ ఉండాలి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం. పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరికొత్త విధానాలు తెచ్చాం. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం". - జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్‌

టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: 'మన బడి - మన భవిష్యత్తు' ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గవర్నర్ తెలిపారు. మెరిట్‌ ఆధారంగా 9 వర్సిటీలకు వీసీలను నియమించామని, స్థానికసంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని, ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఉండాలనేది సీఎం ఆకాంక్ష అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయని గవర్నర్‌ నజీర్ అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అండగా ఉన్నామని, అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

రాయలసీమలో కరవు అనేదే ఉండదు: తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా కార్యక్రమాలు చేపట్టామని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని, రాయలసీమలో కరవు అనేదే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందన్న గవర్నర్, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపామని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ జరిగిందని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఎక్సైజ్, ఇసుకలో లోపభూయిష్ట విధానాలు జరిగాయన్న గవర్నర్, ప్రభుత్వ పన్నులను సైతం దారి మళ్లించారని చెప్పారు.

"వైఎస్సార్సీపీ పాలన వల్ల రాష్ట్రం 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయింది. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీ విధానం తెచ్చాం. సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తెస్తున్నాం. మా ప్రభుత్వం 8 నెలల్లోనే గణనీయమైన పురోగతి సాధించింది. గతప్రభుత్వం నిలిపిన 93 కేంద్ర పథకాల్లో 74 పథకాలు పునరుద్ధరించాం. నీటిపారుదల, రోడ్ల సంబంధిత రూ.10,125 కోట్ల బిల్లులు క్లియర్ చేశాం". - జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్‌

రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు: రూ.2,488 కోట్ల ఆర్థికసంఘం గ్రాంట్‌తో స్థానిక పాలన బలోపేతం చేశామని గవర్నర్‌ నజీర్ తెలిపారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించామని, విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. సుస్థిర వృద్ధికి దోహదపడే 22 కొత్త విధానాల ద్వారా బలమైన పునాది వేశామన్న గవర్నర్‌, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా పవర్ కంపెనీలను ఆకర్షించినట్లు తెలిపారు. గ్రీన్‌కో గ్రూప్, బీపీసీఎల్‌, టీసీఎస్‌ కంపెనీలను ఆకర్షించామని, ఇన్వెస్టర్లు ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఆయా పెట్టుబడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.16 లక్షల కోట్లకు విస్తరించిందని అన్నారు.

కందుకూరి వ్యాఖ్యలు ప్రస్తావించిన గవర్నర్‌: తలసరి ఆదాయం కూడా రూ.2.68 లక్షలకు పెరిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు వృద్ధి చెందాయని అన్నారు. ఈ సందర్భంగా సంఘ సంస్కర్త కందుకూరి వ్యాఖ్యలను గవర్నర్‌ ప్రస్తావించారు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుందని, అవకాశమిస్తే బయటకు వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 దిశగా వెళ్తోందని, సమాజ అభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా వెళ్లాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐటీ విప్లవానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అమెరికాలోని ప్రవాస తెలుగువాళ్ల తలసరి ఆదాయం ఎక్కువని తెలిపారు. ప్రస్తుతం ఏపీ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని, పరిపాలన, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధిలో ఏఐను వినియోగిస్తున్నామని చెప్పారు.

"స్వర్ణాంధ్ర-2047కు పది సూత్రాలతో విజన్‌ రూపొందించాం. పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, నీటి భద్రత, రైతు-అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్‌, వ్యయ నియంత్రణ, విద్యుత్-ఇంధనం ప్రత్యేక దృష్టి పెట్టాం. 'పీపుల్ ఫస్ట్' విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ రూపొందించాం. పేదలకు ఆహార భద్రత కోసం పీడీఎస్‌ను బలోపేతం చేశాం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం". - జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్‌

11 నిమిషాలు నినాదాలు - గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ

Last Updated : Feb 24, 2025, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details