AP CM Jagan at India Today Education Summit : ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. "వై నాట్ 175 (Why Not 175) కుప్పంలో కూడా గెలుస్తున్నాం" అంటూ ఇన్నాళ్లూ మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడిలా ఒక్కసారిగా బేలగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో "ఇండియా టుడే (India Today)" విద్యాసదస్సులో పాల్గొన్న జగన్ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. 56 నెలల పాలనలో శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశానన్నారు. కోట్ల మంది ప్రజలకు సాయం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, చెప్పిన పనులు చేశామని, మ్యానిఫెస్టోలో 99 శాతం అంశాలను అమలు చేశామని వివరించారు. ఆ మ్యానిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి వారి విశ్వాసాన్ని పొందుతున్నామని, అందుకే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
India Today Education Summit 2024 in Tirupati :రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమన్న సీఎం ఆ గీతను కొనసాగిస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతునిస్తూ వస్తున్నాం అని సీఎం చెప్పారు. అంశాలవారీ మద్దతు కేవలం బీజేపీకే పరిమితమా? కేంద్రంలో ఏ పార్టీ గెలిచినా ఇలాగే మద్దతిస్తారా? అని ప్రశ్నించగా దీన్ని ఇక్కడే వదిలేద్దాం. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం అంటూ జగన్ దాటవేశారు.
కాంగ్రెస్ ఎప్పుడూ చెత్త రాజకీయాలే చేస్తుందని విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని జగన్ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేసినప్పుడు బాబాయ్ వివేకానందరెడ్డికి మంత్రి పదవిచ్చి మా పైనే పోటీకి నిలిపిందని వివరించారు. ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి మరోసారి తమ కుటుంబాన్ని విడదీసిందన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెబుతాడన్న జగన్ కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.