Andhra Pradesh CM Chandrababu Sri City Visit: శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని, పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన భేటీలో మాట్లాడారు.
గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం: చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉందన్న సీఎం, శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం కృషిచేస్తున్నామన్న సీఎం, పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని, అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తామని తెలిపారు.
గడచిన ఐదు సంవత్సరాల కాలంలో పారిశ్రామిక వేత్తలకు బకాయి పడిన రాయితీలను చెల్లిస్తామని పారిశ్రామిక వాడలకు పంపిణీ చేసే నీటి పన్నుల పెంపును సమీక్షించి తగ్గించడానికి చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన చంద్రబాబు 1570 కోట్ల రూపాయలతో నిర్మించిన పదహారు పరిశ్రమలను ప్రారంభించారు. తొమ్మిది వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 1200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరిశ్రమలకు ఆయా సంస్థల యజమానులతో ఒప్పందాలు చేసుకొన్నారు.
రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి దేశంలో మరే రాజకీయ నాయకుడు పర్యటించనంత స్థాయిలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో తాను పర్యటించానని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటైన శ్రీసిటీని ఉత్తమ పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
శ్రీసిటీలో ఒకేరోజు 15 కంపెనీలు ప్రారంభం - మరో 7 సంస్థలకు శంకుస్థాపన - CM Chandrababu Naidu Sri City Visit
కొత్త రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్నాం:శ్రీసిటీలో సహజంగా చల్లని వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్స్ ధరలు తగ్గించుకోవాలని సూచించారు. అదే విధంగా ఉత్పత్తి, లాజిస్టిక్స్ ధరలు తగ్గింపు దిశగా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నామన్న సీఎం, రాజధానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ నీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
పైప్‌లైన్ల ద్వారా ఏసీ: గ్యాస్ కాకుండా ఏసీ కూడా పైప్‌లైన్ల ద్వారా తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలని కోరుతున్నానన్నారు. ఉపాధి కల్పించిన 2 వేల మందిలో 50 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మీ తోడ్పాటు ఉందన్న సీఎం, 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. విజన్ 2047 ప్రణాళికతో ముందుకువెళ్తున్నామని, 2047 నాటికి ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దక్షిణ భారత్‌లో జనాభా తగ్గుతోందని, ఉత్తర భారత్‌లో పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు.
'రాష్ట్రానికి కేటాయించిన నిధులు త్వరగా ఇవ్వండి'- ఆ విషయాలన్నీ మోదీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు - CM Chandrababu met Modi
పెట్టుబడుల కోసం పలు దేశాల్లో పర్యటించా:పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారన్న సీఎం, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సంపద సృష్టి, సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుందన్నారు. ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని, పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని గుర్తు చేశారు. భారత్‌ను ఐటీ ప్రపంచపటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పానని, గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టానని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనబడతారన్న చంద్రబాబు, ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారన్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారన్న చంద్రబాబు, దేశంలో హైదరాబాద్‌లో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలున్నాయని తెలిపారు. హైదరాబాద్ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉందని, శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయన్నారు. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటయ్యాయని, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్టరింగ్ క్లస్టర్లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు.
పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌కు గ్రీన్‌సిగ్నల్ - మేఘాకే నిర్మాణ పనులు! - CM Chandrababu Delhi Tour
త్వరలో బకాయిలు చెల్లిస్తాం: మాజీ ముఖ్యమంత్రి తన ఐదేళ్ల పాలనలో ఒకసారి శ్రీసిటీలో పర్యటించలేదని పెట్టుబడులపై ఆయనకున్న అవగాహనకు అద్దంపడుతోందని సీఎం అన్నారు. గత ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలకు అందచేసే రాయితీలు చెల్లించలేదని, అధిక మొత్తంలో బకాయిలున్నాయని తెలిపారు. నిధుల కొరత ఉన్నా సంపద సృష్టించి పారిశ్రామిక వేత్తలకు త్వరలో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. పారిశ్రామిక వాడలకు సరఫరా చేసే నీటి పన్ను ఐదేళ్ల కాలంలో అసాధారణంగా పెంచారని దానిపై సమీక్షించి క్రమబద్దీకరణకు చర్యలు తీసుకొంటామన్నారు.
పారిశ్రామిక వాడల ఆస్థిపన్ను తగ్గించే అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకొంటామన్నారు. పరిశ్రమలకు అగ్నిమాపక శాఖ అనుమతుల మంజూరు, పునరుద్ధరణపై కొత్త విధానం అమలు చేస్తామన్నారు. అనుమతులకు దరఖాస్తు చేసుకొన్న నెల రోజుల్లో ఆమోదం తెలిపేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. అగ్రిమాపక శాఖ అనుమతుల రెన్యువల్‌ను ఐదేళ్లకోసారి చేసుకొనేలా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీసిటీ పర్యటన ముగించుకొన్న అనంతరం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని పరిశీలించారు.
శ్రీసిటీలో 220 కంపెనీలు: ఇప్పటికే శ్రీసిటీలో 220 కంపెనీలు ఏర్పాటయ్యాయన్న సీఎం, ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయమన్నారు. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయని, 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధన, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయమన్నారు.
అంతకుముందు శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేశారు. శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో రూ.1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే - కెమెరా చేతపట్టి ఫొటోలు క్లిక్‌మనిపించిన సీఎం చంద్రబాబు