Youngman Makes Nano Bubble Generator in Kakinada: ఆక్వారంగం అంటేనే ఎన్నో ప్రతికూలతలతో కూడుకున్నది. ఆక్సిజన్, వ్యాధులు, విద్యుత్, వాతావరణం ఇలా తరచూ ఏదొక సమస్య వస్తూనే ఉంటుంది. మంచి దిగుబడులు రావాలంటే వాటిని అధిగమిస్తేనే సాధ్యమవుతుంది. ఈ సమస్యల నుంచి ఆక్వా రైతులను బయటపడేసే ఆలోచన చేశాడు ఆ యువకుడు. దాని కోసం దాదాపు రెండేళ్లు పరిశోధన చేసి మరీ నానో బబుల్ జనరేటర్ తయారు చేశాడు. మరి ఆ నానో బబుల్ ఎలా పని చేస్తుంది? దాని వల్ల ఉపయోగాలేంటో? మనమూ తెలుసుకుందాం.
ఆక్వా రైతులు తరచూ ఎదుర్కొనే సమస్య ఆక్సిజన్ అందించడం. నిరంతరం ఆక్సిజన్ అందిస్తేనే దిగుబడి బాగుంటుంది. ప్రస్తుతం పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నా రు. కానీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఎంతో సవాల్‌తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులు తట్టుకుని రైతులకు లాభం చేకూర్చే నానో బబుల్ జనరేటర్‌ను ఈ యవకుడు తయారు చేశాడు.
నేపథ్యం: కొల్లు నరేంద్ర స్వస్థలం కాకినాడ. డిప్లొమా అనంతరం బీటెక్ పూర్తి చేశాడు. నరేంద్ర కుటుంబీకులు, బంధువులు ఆక్వా సాగులో ఉన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ జనరేటర్లు అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశాడు. అలా ఆక్వా సాగుకూ పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందించాలని అనుకున్నాడు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వా సాగుకు ప్రసిద్ధి. కానీ, భిన్న వాతావరణం మధ్య చెరువులోకి ఆక్సిజన్ పంపడం కష్టం. పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నప్పటికీ అవి చాలీ చాలక నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా దీనికి విద్యుత్ వినియోగమూ అధికమవుతోంది. పరిష్కారంగా రెండేళ్లు పరిశోధన చేసిన నరేంద్ర నానో బబుల్ జనరేటర్‌ను తయారు చేశాడు.
నానో బబుల్ జనరేటర్ ద్వారా హైడ్రోజన్ గాఢత-పీహెచ్, ఆక్సిజన్-డీవో, ఉష్ణోగ్రత, అమ్మోనియా స్థాయిలు క్రమ పద్ధతిలో ఉండేలా రూపొందించాను. ఆక్సిజన్ స్థాయిల్ని బట్టే రొయ్యల ఎదుగుదల, దిగుబడి ఉంటుంది. నానో బబుల్ జనరేటర్ మొదట తన చెరువులోనే ప్రయోగించాననీ, ఆ తర్వాత కొందరు ఆక్వా రైతులకు సైతం అందించి దాని పని పనితీరును పరిశీలించాను. నానో బబుల్ జనరేటర్ వినియోగంతో మునుపటి కంటే 3 రెట్లు అధిక దిగుబడి వస్తున్నట్లు గుర్తించాకే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాను. -నరేంద్ర, నానో బబుల్ జనరేటర్ ఆవిష్కర్త
విదేశాల్లో ఈ టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉందని నరేంద్ర పేర్కొన్నారు. కానీ అందుకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందనీ, ఇక్కడైతే తక్కువ ఖర్చులోనే నానో బబుల్ జనరేటర్ రూపొందించినట్లు చెబుతున్నాడు. నానో బబుల్ జనరేటర్ వినియోగించడం ద్వారా లాభాలు వస్తున్నాయని అక్వా రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విద్యుత్ ఛార్జీలతో పాటు వ్యాధుల బెడద కూడా తగ్గిందని అన్నారు. నరేంద్ర నానో బబుల్ జనరేటర్ సాంకేతికత మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో మరింత పరిజ్ఞానాన్ని జోడించి సాగుదారులు మరింత సులభంగా వినియోగించేలా తయారు చేస్తానని నరేంద్ర తెలిపారు.
దివ్యాంగులకు అండగా విద్యార్థులు - కొత్త టెక్నాలజీతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు
విజయవాడ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు - సైన్స్ ప్రదర్శనలో ఆకట్టుకున్న స్మార్ట్‌గ్లౌజ్ - Vijayawada Students Inventions
71వ 'రిపబ్లిక్ డే'కు 71వేల టూత్‌పిక్‌లతో త్రివర్ణ పతాకం