Young entrepreneur Ramkumar from Vijayawada: ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సొంత ప్రాంతంలోనే పారిశ్రామికవేత్తగా ఎదగాలని కోరిక. ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లినా చదువు పూర్తయిన తర్వాత సొంత ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే తండ్రి నడుపుతున్న పరిశ్రమ నిర్వహణ చేపట్టి కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేర్చాడు. తను సొంతగా మరో పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని కల్పిస్తూ మన్నలు పొందుతున్నాడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఈ కథనంలో.
చిన్నవయసు నుంచే పారిశ్రామికవేత్తగా రాణించాలని కావాలని కలలుకన్నాడీ యువకుడు. తల్లిదండ్రులూ ఆ దిశగా ప్రోత్సాహం అందించారు. అమెరికాకు వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు. సొంత ప్రాంతానికి చేరుకుని పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. ఈ యువకుడి పేరు శ్రీరామ్ కుమార్. విజయవాడ స్వస్థలం. అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడమని తల్లిదండ్రులు సూచించారు. శ్రీరామ్ కుమార్ మాత్రం పారిశ్రామికవేత్తగా ఎదగాలని సొంత ప్రాంతానికి తిరిగి వచ్చేశాడు.
కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తూనే: తండ్రి నడుపుతున్న మైత్రీయ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తూనే 2015లో శ్రీ పద్మజ ఇండ్రస్ట్రీస్ పేరుతో అల్యుమినియం వైర్ల తయారీ పరిశ్రమ స్థాపించాడు. 40 మందికి ఉపాధిని కల్పిస్తూ ఏడాదికి 8 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేర్చాడు శ్రీరామ్. ఎలక్ట్రికల్ రంగంలో రాణించేందుకే అమెరికా వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించానని చెబుతున్నాడీ యువకుడు. చిన్ననాటి నుంచి ఎలక్ట్రికల్ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలనే కోరికే ఉండేదన్నాడు. ఇప్పుడు నూతన సాంకేతికత అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాడు.
ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో అనేక కోర్సులు చేసి ఆ రంగంపై పట్టుసాధించాడు శ్రీరామ్ కుమార్. కష్టాలకు భయపడకుండా అనుకున్న లక్ష్యాలు సాధించేంతవరకు నిరంతరం కృషి చేస్తే విజయం వరిస్తుందన్నాడు. చిన్నపాటి నష్టాలకే కుంగిపోతే ఈ రంగంలో రాణించలేమని మరిన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించాడు.
తట్టుకుని నిలబడితేనే లాభాలు: అల్యూమినియం వైర్ల పరిశ్రమ ప్రారంభించిన మొదట్లో కొంతనష్టం కనిపించిందని, దాన్ని తట్టుకుని నిలబడితేనే లాభాలు సాధ్యమయ్యాయని చెబుతున్నాడు శ్రీరామ్ కుమార్. 5 కోట్ల రూపాయలతో పెద్దపెద్ద ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి మరింత మందికి ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తానంటున్నాడు.
తమ కుమారుడు చిన్ననాటి నుంచి వ్యాపార రంగంలో రాణించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాడని రామ్‌కుమార్ తండ్రి ప్రసాద్ తెలిపారు. తమ యజమాని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులతో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడని సిబ్బంది వివరించారు. ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో అన్నిరకాల ట్రాన్స్‌ఫార్మర్లు రూపొందించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మరింత ఉపాధిని కల్పిస్తానంటున్నాడు శ్రీరామ్ కుమార్.
"నేను ఇక్కడే ఇంజినీరింగ్ పాస్ అయ్యాను. తరువాత యూఎస్ వెళ్లాను. అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ల దానిలో స్పెషలైజేషన్ చేశాను. మా నాన్నది ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీ కాబట్టి దీనిలో నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్లాలనుకున్నాను. అందుకే యూఎస్ నుంచి రావడం జరిగింది. మా దగ్గర 100% క్వాలిటీ ఉంటుంది". - శ్రీరామ్ కుమార్, యువ పారిశ్రామికవేత్త
సంతృప్తినివ్వని ఉద్యోగం - లక్షల వేతనం వదిలేసి డ్రోన్ రంగంలోకి
"అమ్మ డైరీలో కొన్ని పేజీలు" - తొలి నవలతో ప్రశంసలు అందుకున్న టెకీ