తెలంగాణ

telangana

ETV Bharat / politics

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మరి మంత్రులు ఎవరో? - AP NEW CABINET MINISTERS List - AP NEW CABINET MINISTERS LIST

AP New Cabinet Ministers 2024 : కేంద్ర మంత్రివర్గం కొలువదీరడంతో శాఖలు కేటాయింపు పూర్తికావడంతో ఇక ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్‌ చేసి చెప్పే అవకాశముంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉపముఖ్యమంత్రిగా ఉండే అవకాశముంది. పవన్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్ర నాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

AP NEW CABINET MINISTERS
AP NEW CABINET MINISTERS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 11:10 AM IST

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మంత్రి యోగం ఎవరెవరికో? (ETV Bharat)

AP Deputy CM Pawan Kalyan 2024 :ఆంధ్రప్రదేశ్లోఎన్డీయే కూటమి 164 సీట్ల సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లన్నీ మంత్రివర్గంపైనే నెలకొన్నాయి. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులందరూ ప్రమాణం చేస్తారా? లేదా కొంతమందే చేస్తారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గం కూర్పంటే ప్రాంతీయ సమతూకం పాటించాలి. కులాల వారీగా అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి. మిత్రపక్షలాను కలుపుకుపోవాలి.

ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. దిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపైనా కసరత్తు చేస్తున్నందున నేతల్లో సస్పెన్స్‌ పెరుగుతోంది. దిల్లీలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు ఏం మాట్లాడుకుని వచ్చారు. జనసేన నుంచి మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ చోటు ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులుగా చోటు దక్కనుండటంతో వారెవ్వరనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వడపోత మామూలుగా ఉండదని నేతల అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కుల, మత, ప్రాంత సమీకరణాల వడపోసే క్రమంలో కొందరికి నిరాశ మరికొందరికి సువర్ణావకాశం దక్కనుంది.

AP New Cabinet Ministers 2024 :జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి ఈసారి అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, కూన రవికుమార్‌, కొండ్రు మురళీలలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి. కేంద్ర కేబినెట్‌లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి చోటు దక్కడంతో ఆ ప్రభావం ఈ జిల్లా నేతలపై పడుతుందనే చర్చా లేకపోలేదు. విజయనరం జిల్లా విషయానికొస్తే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్‌ నేత కళా వెంకట్రావు వైఎస్సార్సీపీ కీలక నేత బొత్సను ఎన్నికల్లో మట్టికరిపించి మంత్రివర్గ రేసులో నిలబడ్డారు.

ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు నేను రెడీ - పవన్ కల్యాణ్ క్లారిటీ? - PAWAN INTERESTED AP DEPUTY CM POST

సీనియారిటీలను వడబోసి మంత్రివర్గంలో బెర్తులు :విజయనగరం జిల్లాలో అదితి గజపతి రాజు, ఎస్టీ కోటాలో సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో సామాజిక సమీకరణాలు, సీనియారిటీలను వడపోసి మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేయడం కత్తిమీద సాము లాంటిది. ఈ జిల్లా నుంచి గెలిచిన వారిలో మాజీమంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన యాదవ సామాజిక వర్గ నేత పల్లా శ్రీనివాస్‌, బీజేపీ కోటా కింద విష్ణుకుమార్‌ రాజు రేసులో ఉన్నారు. దీంతో సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు ఏ మేర అవకాశం కల్పిస్తారనేది వేచి చూడాలి.

మంత్రివర్గంలో అందరి చూపూ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మీదే ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే మంత్రులుగా చేశారు. వీరిలో ఎవరికైనా చోటు దక్కుతుందా లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇదే జిల్లా నుంచి ఈసారి జ్యోతుల నెహ్రూ, బీజేపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సీ సామాజికవర్గం నుంచి అయితాబత్తుల ఆనందరావు, జనసేన నేత కందుల దుర్గేష్‌ లాంటి వారు మంత్రిపదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ పరిధిలో నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణరాజు, పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్‌ రేసులో ఉన్నారు. అయితే ఇదే లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కడంతో ఆ ప్రభావం ఎవరి మీద పడుతోందో వేచి చూడాలి.

ఏపీ కేబినెట్‌లోకి నారా లోకేశ్ - ఏ శాఖలు అప్పగిస్తారంటే? - Nara Lokesh May Join New Cabinet in AP

ఏపీలో మంత్రి పదవిపై చర్చ :ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే కైకలూరు, నూజివీడు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్‌, పార్థసారధి గతంలో మంత్రులుగా చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర సైతం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేశారు. వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి. కొత్త ముఖాలను పరిచయం చేయాల్సి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీని ఓడించిన వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులో ఒకరిని పరిగణలోకి తీసుకుంటారా లేదా సీనియర్‌ నేత గద్దె రామ్మోహన్‌ పేరు పరిశీలిస్తారా లేక బీజేపీ కోటా నుంచి సుజనా చౌదరి తెరమీదకు వస్తారా అనే చర్చ సాగుతోంది. ఇతర సామాజికవర్గాల నుంచి శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, బొండా ఉమా లాంటి వారిలో ఎవరికీ అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి.

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రేసులో ఉన్నవారు సంఖ్య అధికంగానే ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు లాంటి వారు పోటీ పడుతున్నారు. అయితే లోకేశ్ మంత్రివర్గంలోకి వస్తారనే ప్రచారం సాగుతుండటం, జనసేనలో నెంబర్‌ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను తీసుకోవాల్సి వస్తే ఇతర సామాజికవర్గాల వైపు అధిష్ఠానం చూపు ఉండవచ్చని తెలుస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించినందున ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో వేచి చూడాలి. ఎస్సీ కోటాలో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్‌, కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణల్లో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందోనని చర్చ సాగుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. బీసీ కోటా పరిశీలిస్తే బీదా రవిచంద్రయాదవ్‌కు ఎమ్మెల్సీ ద్వారా అవకాశం లభిస్తుందేమో చూడాలి.

సీఎంగా చంద్రబాబు ప్రాతినిథ్యం :ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తుండగా మంత్రివర్గంలో ఈసారి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, జనసేన కోటాలో ఆరణి శ్రీనివాస్‌ పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈసారి పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కోటా నుంచి గుమ్మనూరు జయరాం, సవితల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ పేరు వినిపిస్తుంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ అధికంగా ఉంది. సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియా, బీసీ జనార్దన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డిల్లో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. ముస్లిం మైనార్టీ కోటాలో ఫరూఖ్‌కు, బీజేపీ కోటా నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.

జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో సుదీర్ఘకాలం తర్వాత కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పేరు మహిళా కోటాలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేరు పరిశీలనలకు రావొచ్చని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి 38 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రాంగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. అదే ఊపు సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగడం వల్ల భూమిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం - AP Chandrababu Naidu oath ceremony

ఏపీ కేబినెట్‌లోకి బీజేపీ, జనసేన - టీడీపీ నుంచి ఎవరికి ఛాన్స్? - AP New Cabinet Ministers 2024

ABOUT THE AUTHOR

...view details