చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి రానున్న ముగ్గురు అగ్రనేతలు All Set for First Public Meeting of TDP, Janasena and BJP:తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద తొలి భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి మూడు పార్టీల శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా తరలి రానున్నారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కనీవిని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాగళం బహిరంగ సభ కోసం టీడీపీ ఆధ్వర్యంలో మూడు పార్టీల ముఖ్యనేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి.
రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?
ప్రజాగళం సభ ద్వారా మూడు పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు సంయుక్తంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు బొప్పూడి సభ వేదికగా బలంగా చాటి చెప్పనున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించనున్నారు. ఎన్టీఆర్, వాజ్‌పేయీ హయాం నుంచి టీడీపీ, బీజేపీ మధ్య మైత్రి కొనసాగుతున్నా మధ్యలో కొంత విరామం వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీలు మళ్లీ జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో జనసేన కూడా జతకలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు చిలకలూరిపేట వద్ద జరుగుతున్న సభలో ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదికపైకి వస్తున్నారు.
మరో జాతీయ సర్వేలోనూ టీడీపీకే పట్టం - తెలంగాణలో కాంగ్రెస్కు ఆధిక్యం
సభికులు అందరికి కనిపించేలా ప్రధానవేదికను ఎత్తులో ఏర్పాటుచేయడంతో వేదిక నుంచి జాతీయ రహదారి వరకు ప్రజలు ఎక్కడున్నా తిలకించే వెసులుబాటు కలగనుంది. సభలో మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఆయా గ్యాలరీలకు రెండు వైపుల నుంచి వెళ్లేందుకు ప్రత్యేకంగా మార్గాలు ఉన్నాయి. వీటి అదనంగా వెనుక వైపు నిలబడేవారికి కొన్ని గ్యాలరీలు ఉన్నాయి. సభలో లక్షలమంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో నాలుగువైపులా డ్రమ్ములు పెట్టి మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచారు. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి స్థానికంగా భోజన ఏర్పాట్లు చేసుకునేలా నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో మూడు పార్టీల నేతల భారీ కటౌట్లు పెట్టారు. జాతీయ రహదారికి ఇరువైపులా భారీ ప్లెక్సీలతో నేతలు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్దఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. సభాప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భారీ హోర్డింగులు పెట్టారు. సభా ప్రాంగణం మూడు పార్టీల ప్లెక్సీలు, జెండాలతో కళకళలాడుతోంది.
కూటమిని ఆశీర్వదించండి - సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: చంద్రబాబు, పవన్
మూడు పార్టీలు బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సభకు లక్షలాది మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. సభ నిర్వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పొరుగు జిల్లా బాపట్ల నుంచి అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనం తరలిరావడానికి ఏర్పాట్లు చేశారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సభకు వచ్చేవారికి రవాణా సౌకర్యాలు కల్పించారు. చిలకలూరిపేట పరిసర నియోకవర్గాల నుంచి ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్దఎత్తున వస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ వసతి కల్పించారు.
ఆర్టీసీ, ప్రైవేటు విద్యాసంస్థలు, ట్రావెల్స్ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున లక్షల మంది హాజరవుతున్నందున ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, జనసేన విడివిడిగాను, సంయుక్తంగాను కొన్ని ఎన్నికల సభల్ని విజయవంతంగా నిర్వహించాయి. విజయనగరం జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభతో మొదలైన ఆ పార్టీల ఎన్నికల ప్రచారం ఇప్పుడు ప్రజాగళం సభతో పతాక స్థాయికి చేరబోతోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేనలతో పొత్తు ఖరారయ్యాక జరుగుతున్న తొలి బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.