Telangana Graduate MLC By Poll in 2024 : ఉమ్మడి వరంగల్ నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలో 90 శాతం ఓట్లు కాంగ్రెస్‌కే వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని స్థానిక నేతల మధ్య చోటు చేసుకున్న అంతర్గత విభేదాల నడుమే నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. భద్రాచలంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉనికే లేదని విమర్శించారు.
Graduate MLC Elections Campaign 2024 :కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ , మోసగాడని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పేర్కొన్నారు. మల్లన్నను గెలిపిస్తే రేవంత్ రెడ్డిని నిలదీయలేడని అందుకే రాకేశ్‌ను గెలిపించాలని ములుగులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే కరెంట్ కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా అని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, హనుమకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు.
'కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేశారు.కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే కరెంట్ కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా?రాకేష్ రెడ్డిని గెలిపించాలి. నాలుగు వందల హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. అవి నెరవేరాలంటే ప్రశ్నించే గొంతుకను రాకేష్ రెడ్డిని గెలిపించాలి.' - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు