AICC Focus on Telangana PCC :నేతల చేరికలపై సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తులపై పీసీసీ దృష్టిసారించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికతో మనస్తాపానికి గురైన జీవన్‌రెడ్డిని బుజ్జగించినా వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా చేరికలను నిలుపుదల చేయాలని పీసీసీ నిర్ణయించింది. అయితే జీవన్‌రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ ఎలా స్పందిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60 కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా మరొకటి మిత్ర పక్షమైన సీపీఐకి ఒకటి మొత్తం 66 స్థానాలు ఉన్నాయి. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, బీఆర్‌ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తోంది. కాంగ్రెస్,సీపీఐలకు చెందిన 66 స్థానాలతోపాటు ఎంఐఎంకు చెందిన 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తీసుకుంటే మొత్తం 73 స్థానాలు ఉండగా ప్రభుత్వం కూలేందుకు ఏ మాత్రం అవకాశం లేదన్న విషయాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Congress Joinings 2024 : అయితే కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇటీవల బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు కొందరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 38, బీజేపీకి చెందిన 8 కలిస్తే ఆ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సంఖ్య 46 కు చేరుతుంది దీని వల్ల ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంటుందని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ఏఐసీసీ నుంచి అనుమతి తీసుకుని చేరికల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఆప్‌రేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చే నాయకులను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేరికలు ఊపందుకున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్, స్టేషన్ గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ దయాకర్, బీర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు సునీత మహేందర్ రెడ్డి, అనిత రెడ్డి లతోపాటు పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.