AICC Focus On Telangana Mahila Congress Leader : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. ఆమె స్థానంలో కొత్త నాయకురాలిని నియమించేందుకు గత కొంత కాలంగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. తనను మహిళ కాంగ్రెస్ పదవి నుంచి త్వరలో తొలిగిస్తారని తెలుసుకున్న ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు జాతీయ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు.
మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అలకలాంబ ద్వారా కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి తొలిగించేప్పటికి మరొక నామినేటెడ్ పదవి ఇవ్వాలని సునీతరావు కోరుతున్నారు. మహిళా అధ్యక్షురాలి కోటా కింద ఈమె గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారెవరికి కూడా ఏడాదిపాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు జాతీయ స్థాయిలో లాబీయింగ్ : అయినా కూడా రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఇలా ఓడిన కొందరికి పదవులు ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తనకు కూడా పదవి ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను పలువురిని కలిసి తనకు తన స్థాయికి తగిన పదవి ఇచ్చేట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి సిఫారసు చేయించారు.
అంతేకాదు కొందరు మహిళ నాయకులను దిల్లీ తీసుకెళ్లిన సునీతారావు నిరసనలు కూడా చేశారు. అయినా మార్పు ఖాయమని తెలుసుకున్న సునీతారావు, ఆ పదవి వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తనతోపాటు పని చేస్తున్న నీలం పద్మకు ఆ పదవి ఇవ్వాలని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గద్వాల్ మాజీ జిల్లా పరిషత్తు ఛైర్పర్సన్ , కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్య, బడంగిపేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డిలతోపాటు మరో బీసీ మహిళ సరిత పేరును కూడా జూలై 11న ఏఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
AICC Appointed New Chiefs in 3 States : ఈ ముగ్గురిలో ఒకరికి మహిళా కాంగ్రెస్ పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా తాను సూచించిన పద్మకే ఆ పదవి ఇవ్వాలని సునీతారావు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మంగళవారం రాత్రి కర్ణాటక మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సౌమ్య రెడ్డి, చండీఘడ్‌కు నందిత హుడా, అరుణాచల్ ప్రదేశ్‌కు చుకునచ్చిలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమిస్తూ పేర్లను ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా త్వరలో జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ - ఆ నలుగురికే ఛాన్స్ - నామినేటెడ్ పదవుల భర్తీపైనా ఫోకస్ - TELANGANA CABINET EXPANSION 2024
టీ కాంగ్రెస్‌కు కొత్తకష్టాలు - అధికారం కోసం బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల అలక - Telangana Congress Joinings 2024