తప్పుల తడకగా ఓటరు జాబితా - భారీగా బోగస్ ఓట్లు Voter List Mistakes in Andhra Pradesh : ఎన్నికలు సమీపిస్తున్నా రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఇప్పటికీ చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించినా కుప్పలుతెప్పలుగా తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. మృతుల పేర్లు, డబుల్ ఓట్లు, స్థానికేతరులకు ఓట్లు ఇలాంటి అవకతవకలు అలానే ఉన్నాయి. బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని పోలింగ్ బూతుల్లో ముస్లిం వర్గం లేకున్నా 32 మందికి ఓట్లు ఉన్నట్లు చూపుతోంది. ముసాయిదా జాబితాలోనూ ముస్లింల పేర్లు ఉండటంతో మార్పు కోసం దరఖాస్తు చేశారు. తుది జాబితాలో ఎలాంటి మార్పులూ చేయకపోవడంతో ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
8, 9 వార్డుల్లో ఉండాల్సిన ముస్లిం కుటుంబీకుల పేర్లు ఒకటో వార్డులోని 65, 66, 67 పోలింగ్ బూతుల్లో నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటో వార్డు నుంచి 9వ వార్డుకు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వారు అంత దూరం వచ్చి ఎలా ఓటు వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ మృతి చెందిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించలేదు. పలు పోలింగ్ బూతుల్లో ఐదేళ్ల క్రితం మరణించినవారి పేర్లు ఇప్పటికీ ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Anantapur District Voter List Errors :అనంతపురం జిల్లా ఉరవకొండలోని 128వ నంబరు పోలింగ్ కేంద్రంలో మృతుల పేర్లు ఇప్పటికీ ఓటరు జాబితా ఉన్నాయి. ఇక్కడ 35 మందికిపైగా మృతుల పేర్లు జాబితాలో ఉండటం అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. ఇంటింటా జాబితా పరిశీలన సమయంలో బీఎల్ఓలు, స్థానికులు సమస్యలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచ్చారు. అన్నీ సవరిస్తామని చెప్పిన అధికారులు అలాగే కొనసాగించారు. ఐదుగురికిపైగా డబుల్ ఓట్లు వచ్చాయి. ఈ కేంద్రంతో సంబంధం లేని మరో నలుగురికి ఓటు హక్కు కల్పించారు.
మీ ఓటును లేపేసిన అధికారులు - భారీగా బోగస్ ఓటర్లకు చోటు?
ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన సోంపల్లి కృష్ణకాంత్ కుటుంబం ఇరవై సంవత్సరాల కిందట కర్నూలు వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన కర్నూలు నగర వైసీపీ కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. తుది ఓటర్ల జాబితాలో నింబగల్లులోని 147వ పోలింగ్ కేంద్రంలో కృష్ణకాంత్‌తో పాటు ఆయన తల్లిదండ్రుల పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఇక్కడి బీఎల్ఓలు వారిని ఓటర్లుగా కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
Krishna District Voter List Errors :కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలో తుదిజాబితాలోను భారీగా ఓట్లు అక్రమాలు బయటపడుతున్నాయి. నాలుగైదు దశాబ్దాలుగా ఓటు కలిగి ఉన్న వారిని సైతం తాజా జాబితాలో తీసేశారు. కొందరి పేర్లపై డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు వెలుగుచూస్తుండగా తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు చాలా వరకు గల్లంతయ్యాయి. గుడివాడ మండలం వలివర్తిపాడులో పెద్దమనిషిగా ఉన్న మోహనరావు, ఆయన కుమార్తె రమ్య ఓట్లు గల్లంతయ్యాయి. జాబితాలో చనిపోయినవారి పేర్లు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. గుడివాడ మాజీ వైసీపీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మికి 16వ వార్డులోని 112, 114 కేంద్రంలో డబుల్ ఓట్లు ఉన్నాయి. దీనిపై గతంలోనే తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసినా తుదిజాబితాలోనూ డబుల్ ఓట్లు కొనసాగించారు.
కొత్త ఓటర్ల జాబితాలోనూ కుప్పలు తెప్పలుగా అవే పాత తప్పులు!
Vijayawada Voter List Errors :విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఇప్పటికీ వెలుగుచూస్తునే ఉన్నాయి. అనేక మంది స్థానికేతరులను ఇతర డోర్ నంబర్లతో చేర్పించారు. ఒకే ఇంటి ఓట్లు వేర్వేరు డివిజన్లలో ఉన్నట్లు నమోదు చేశారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో మరణించినవారికి ఇప్పటికీ ఓటు హక్కు కొనసాగుతోంది. ఇక డబుల్ ఎంట్రీలకైతే కొదవే లేదు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ స్థానికులు కానివారిని కనీసం 20 మందిని ఓటర్లుగా చర్పించారని ప్రతిపక్షాలు నాయకులు ఆరోపిస్తున్నారు.
అనుయాయులు, మద్దతుదారులకు రెండుమూడు ఓట్లు - గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమాలు