Fake Police Gang Looted Rs. 25.5 Lakh From Gold Merchant : అతడు పలు వ్యాపారాలు చేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. తీర అన్నింట్లో నష్టపోయి నేరాల బాట పట్టాడు. ఎవరెవరు చెన్నై గోల్డ్ మార్కెట్కు వెళ్తారో నిఘా పెట్టాడు. ట్రైన్ టికెట్ ద్వారా వారి వివరాలు తెలుసుకుని లక్షల రూపాయలను దోచేసే స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం నకిలీ పోలీసుల ముసుగులో ఏకంగా రూ. 25.5 లక్షలు దోచేశాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులే నిర్ఘాంతపోయేలా చేసిన ఈ ఘటన విజయవాడలో వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విజయవాడ సీపీ రాజశేఖర బాబు మీడియాకు వెల్లడించారు. "ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పార్థ సాయి గతంలో పలు వ్యాపారాలు చేశాడు. జల్సాలకు అలవాటు పడి నష్టపోయాడు. అనంతరం అక్కడ నుంచి విజయవాడకు మకాం మార్చాడు. జగ్గయ్యపేట నుంచి నిత్యం దుకాణదారులు నెల్లూరు, చెన్నై వెళ్లి బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీనిపై పార్థసాయి నిఘా పెట్టాడు. తన బంధువుకు టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది. అక్కడకు వెళ్లి జగ్గయ్యపేట నుంచి ఎవరెవరు టికెట్లు బుక్ చేసుకున్నారో తెలుసుకున్నాడు.
'మేం పోలీసులకు భయపడం - డబ్బులు ఇవ్వం, అరెస్ట్ చేస్తారా చేయండి'
ఈనెల 11 న రామకృష్ణ అనే వ్యక్తి బంగారం కొనుగోలుకు చెన్నై వెళ్తున్నట్లు గుర్తించాడు. శాంతి అనే మహిళతో కలిసి నగదు దోచేందుకు పథకం వేశాడు. శాంతితో పాటు తెలంగాణాలో రౌడీషీటర్ అజారుద్దీన్, పటాన్ సుభాని, వంశీ కలిసి పథకం వేశారు. వ్యాపారి రామకృష్ణ 11వ తేదీన రైలు మిస్ కావటంతో కారు బుక్ చేసుకుని విజయవాడ బయలుదేరాడు. ఆ వివరాలు సేకరించిన పార్థసాయి మిగిలిన నిందితులకు సమాచారం అందించాడు. విజయవాడ ప్రభాస్ కాలేజీ వద్దకు రాగానే ఇద్దరు వ్యక్తులు పోలీసుల్లా డ్రెస్ వేసుకుని రామకృష్ణ కారును నిలువరించారు. తాము పోలీసులమని మీపై అనుమానం ఉంది. కారును తనిఖీ చేయాలని చెప్పారు. తనిఖీలో కారులో బ్యాగు ఉన్నట్టు గుర్తించారు. బ్యాగులో అంత నగదు ఎందుకు ఉంది అని ప్రశ్నించారు.
మా ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి బ్యాగును చూపించి తీసుకువస్తామని చెప్పారు. భయంతో రామకృష్ణ వారికి బ్యాగు ఇచ్చాడు. తీసుకెళ్లిన వ్యక్తులు ఇంకా రాకపోయేసరికి రామకృష్ణకు బీపీ పెరిగి పడిపోయాడు. దీంతో కారు డ్రైవర్ జగ్గయ్యపేట తీసుకెళ్లి రామకృష్ణను ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత 15వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 25.5 లక్షల రూపాయలను పోలీసుల పేరుతో దోచేశారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు టవర్ లొకేషన్ డంప్ చేశారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. దోపిడీ ముఠాను సిటీ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.25.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు" అని సీపీ రాజశేఖర బాబు మీడియాకు వివరించారు.
పోలీసు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం - కోట్లలో వసూళ్లు
అయితే నిందితుడు పార్థసాయి తాను తెరపైకి రాకుండా మిగిలిన నిందితులను పోలీసులుగా పంపాడు. ఆ సమయంలో మరో నిందితుడు పటాన్ సుభానీ పార్థసాయికి విజయవాడలోని ప్రభాస్ కాలేజీ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు. ఆ కాల్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. అనంతరం సీసీ ఫుటేజీలను సేకరించారు. నిందితులు దోచిన సొత్తును శాంతి ఇంట్లో దాచి పెట్టినట్లు గుర్తించి ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. మిగిలిన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
ఆన్లైన్ రమ్మీలో రూ.50 లక్షలు లాస్.. అప్పు తీర్చేందుకు ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకు దొంగతనం.. చివరకు..