Attacks on Hinduism in Andhra Pradesh: అన్ని మతాలను సమభావంతో చూడటం ప్రభుత్వాల కర్తవ్యం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలా జరుగుతోందా? హిందూ ఆలయాలపై పదేపదే ఎందుకు దాడులు జరిగాయి? హిందూ దేవుళ్లను కించపరిచే చర్యలు ఎవరు చేస్తున్నారు? మెజార్టీ మతస్తుల మనోభావాలను పదేపదే అదేపనిగా దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? రాష్ట్రంలో ఆలయాల నిర్వహణ ఎలా ఉంది? ఆలయపాలక మండళ్ల నియామకంలో నైతిక ప్రమాణాలు పాటిస్తున్నారా? దేవదాయ శాఖ తన పని తాను చేస్తోందా? పింక్ డైమండ్ పోయిందని శ్రీవేంకటేశ్వరుడిని కూడా రాజకీయం చేసిన వైసీపీ, టీటీడీకి ఎలాంటి పాలకమండళ్లని నియమించింది? అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ విషయాలను మనతో పంచుకునేందుకు హిందూ సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్ రామణపూడి శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి చర్చలో పాల్గొన్నారు.
జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?
ఐదేళ్ల జగన్ పాలనలో హిందువులకు చాలా గడ్డుకాలమని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. చరిత్రలో మహ్మదీయ దాడులు జరిగేటప్పుడు హిందూ ఆలయాలు, ధర్మంపై దాడులు, హిందూ సంప్రదాయాలపై దాడులు, ఆలయాలు, ఆలయ భూములు ఎన్నో కోల్పోయామని, చరిత్ర ఘటనలు జగన్ పునరావృతం చేస్తున్నారన్న ఆలోచన, భయంతో అందరిలో కల్గిందని పేర్కొన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని అన్నీ ఆలయాలపై రకరకాలుగా దాడులు జరిగాయని, చివరకు రామతీర్థలో రాములవారి శిరస్సు ఖండన చేయడం వంటి దాష్టీకానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఒకటికాదు,రెండు కాదని, వందలాది దాడులు హిందూదేవాలయాలపై జగన్ పాలనలో పదేపదే ప్రతిరోజు జరుగుతున్నాయని తెలిపారు. దోషులను శిక్షించకుండా హిందువులకు మనోధైర్యం ఇవ్వకుండా, ఈ ఘటనలు ఖండిస్తున్నామని చెప్పకుండా, ప్రభుత్వ పెద్దలు ఒక్కమాట కూడా మాట్లాడలేదని శ్రీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.
జగన్ పాలనలో చాలా దారుణ ఘటనలు హిందువులం ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అన్యమతాలను గౌరవించాలని, సమదృష్టితో చూడాలని తెలిపారు. జగన్ ప్రభుత్వం మాత్రం వివక్షతతో హిందుత్వాన్ని అణచివేద్దామని, హిందూధర్మాన్ని నాశనం చేద్దామని హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు, స్థలపురాణాలు, స్థానిక ఆచరాలు ఇవన్నీ మంటగలిపే విధంగా భయానకస్థితికి తీసుకుపోయిందని విమర్శించారు.