Prathidwani Debate on Drugs :సరదాగా కిక్ కోసమో, థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తుమందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయి. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత కెరీర్ సర్వనాశనం అవుతోంది. డ్రగ్స్ వ్యసనాల్ని వదులుకోలేని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు తమవంతుగా కృషి చేస్తున్నాయి.
అయినా డ్రగ్స్ మాఫియా ఆగడాలు అంతం కావడం లేదు. అసలు పోలీసులు, నిఘా సంస్థల కళ్ళుగప్పి గంజాయి, డ్రగ్స్ తయారీ ఎలా జరుగుతోంది? మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఏర్పడే మానసిక, శారీరక అనర్థాలు ఏంటి? చిన్నపిల్లలు, విద్యార్థులు, యవత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుమందుల సరఫరాను సమర్థంగా అడ్డుకోవడం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.
International Day Against Drug Abuse : డ్రగ్స్ మహమ్మారి యువత భవితవ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. దేశ అభివృద్ధికి తోడ్పడాల్సిన విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటుపడి వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదారాబాద్‌లో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Minister Jupalli On Drug Abuse :అన్ని జన్మలకంటే మానవజన్మ ఎత్తడం అదృష్టమని మంత్రి జూపల్లి అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కలలు కనాలి వాటిని నిజం చేసుకోవాలన్నారు. కానీ కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తమ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదారాబాద్‌లో తెలంగాణ యాంటి నార్కొటిక్స్ బ్యూరో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, డీజీపీ రవి గుప్త, ప్రముఖ క్రికెటర్ మిథాలి రాజ్, సినీ నటులు సుమన్, తేజ సజ్జ పాల్గొన్నారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలిచ్చాం :డ్రగ్స్ మహమ్మారి మన రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ మత్తులో విచక్షణ కోల్పోయి బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే డ్రగ్స్‌పై ఉక్కుపాదంతో మోపాలని ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు.
విద్యార్థులు క్రీడలు, నటన వంటి వాటి పట్ల ఆకర్షితులవ్వాలి గానీ మత్తుపదార్థాల పట్లకాదని డీజీపీ రవిగుప్త అన్నారు. మాదకద్రవ్యాలు వినియోగించడం వల్ల మన మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు లోనవుతామని మాజీ క్రికెటర్ మిథాలి రాజ్ తెలిపారు.
డ్రగ్స్ వల్ల జీవితాలు రోడ్డున పడతాయి :డ్రగ్స్ అలవాటు పడిన వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల జీవితాలు సైతం రోడ్డు పడతాయని సినీనటుడు సుమన్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదిగి మంచి కుటుంబంతో సంతోషంగా బతకాలని అన్నారు. క్రీడాకారులను, ఉన్నతాధికారులను ఆదర్శంగా తీసుకుని వారిలాగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సినీనటుడు తేజ అన్నారు. మత్తు పదార్థాల్లో కాదు అసలైన కిక్కు అందులో ఉంటుందన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గతంలో నార్కొటిక్ ఎస్పీగా పనిచేసిన ఎగ్గడి భాస్కర్ రాసిన పాటను జూపల్లి విడుదల చేశారు. కార్యక్రమంలో అవగాహన కల్పిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు.