Panneerselvam Tamilnadu Polls 2024 : తమిళనాడులోని రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమే. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం ఎన్డీయే మద్దతుతో ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పలు అంశాలు ఆయనకు అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా రామనాథపురం సీటులో ముక్కోణపు పోటీ నెలకొంది. పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే, IUML మధ్య త్రిముఖ పోరు ఉండడం వల్ల ఈ ఎన్నిక పన్వీర్‌సెల్వంకు పెద్ద సవాల్‌గా మారుతోంది.
అది తేల్చుకునేందుకే పోటీ!
అన్నాడీఎంకే తనను బహిష్కరించడం, రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు న్యాయస్థానాలు తనకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే శ్రేణులు తనవైపు ఉన్నారా? పళనిస్వామి వైపు ఉన్నారా? తేల్చుకునేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇదే స్థానం నుంచి అన్నాడీఎంకే తరఫున జయపెరుమాల్ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్- IUML అభ్యర్థిగా నవాజ్ కని బరిలో ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 25 మంది పోటీలో ఉన్నా ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రామనాథపురంలో అన్నాడీఎంకే గెలుపొందగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో IUML నుంచి నవాజ్ కని బీజేపీ అభ్యర్థిపై లక్షకుపైగా ఓట్లు తేడాతో నెగ్గారు.
సత్తా చూపించాలని పట్టుదలతో
ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పన్నీర్ సెల్వం ఈ ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నారు. వాస్తవంగా రామనాథపురం స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది. చివరికి ఓపీఎస్‌కు కేటాయించారు. రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో6 అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగు అధికార డీఎంకే, రెండు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటాయని బీజేపీ నాయకత్వం అంటోంది.
గెలుపే లక్ష్యంగా!
పన్నీర్ సెల్వం తమతో జట్టు కట్టడం వల్ల బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. సిట్టింగ్ ఎంపీ, IUML అభ్యర్థి నవాజ్ కని మరోసారి గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగం కావడం వల్ల అధికార డీఎంకే పార్టీ మద్దతు కూడా నవాజ్‌కు ఉండడం కలిసొచ్చే అంశం. 2019లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించిన అన్నాడీఎంకే ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. పన్నీర్ సెల్వం పోటీలో ఉండడం వల్ల అన్నాడీఎంకే ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది IUML అభ్యర్థికి అనుకూలంగా మారే అవకాశం ఉందన్నారు.