Lok Sabha Key Seats 2024 :2024 లోక్‌సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో అన్నీ రాజకీయ పార్టీలు ఇక ప్రచార శంఖారావాన్ని మోగించనున్నాయి. ప్రముఖ నాయకులు సభలు, ర్యాలీలతో జనంతో మమేకం కానున్నారు. తమ తమ పార్టీల మ్యానిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నారు. ఇదిలా ఉంటే కొన్ని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల మధ్య హైఓల్టేజ్ పోటీ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని సీట్లలో దేశంలోని బడా నేతలు బరిలో ఉండటం వల్ల అందరి చూపు వాటిపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కేరళలోని వయనాడ్ దాకా రసవత్తర పోటీకి నెలవుగా మారిన కొన్ని లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వారణాసి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తుండటం ఇది మూడోసారి. 2014లో ఈ స్థానం నుంచి మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసి ఓడిపోయారు. 2019లో ప్రధాని మోదీపై సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు షాలినీ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే ఇంతటి కీలకమైన స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంకను ఏదైనా సేఫ్ సీటు నుంచి బరిలోకి దింపడం మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే ఆమెను ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్న రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించింది. దీంతో ప్రధాని మోదీకి కనీసం బలమైన పోటీని ఇవ్వగల అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి త్వరలోనే వారణాసి స్థానానికి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. 2019లో వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపింది. ప్రధాని మోదీ కంటే ముందు వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషీ ఎన్నికయ్యారు.
వయనాడ్
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండటం ఇది రెండోసారి. ఈ స్థానంలో సీపీఐ నేత అన్నీ రాజా, రాహుల్ గాంధీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అన్నీ రాజా మహిళా హక్కుల కార్యకర్త. వయనాడ్‌లో కాంగ్రెస్, సీపీఐ పోటీపడటం ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే ఇవే రెండు పార్టీలు జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సీపీఐ సర్వశక్తులు ఒడ్డుతుందా? అక్కడి పూర్వ ఫలితాన్ని తిరగరాస్తుందా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానంలో సీపీఐకు చెందిన పీపీ సునీర్‌ను 4.31 లక్షల ఓట్ల తేడాతో రాహుల్ గాంధీ ఓడించారు. ఈ చేదు అనుభవంతో కంగుతిన్న సీపీఐ ఈసారి తమ అభ్యర్థిని మార్చేసి పార్టీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జనరల్ సెక్రటరీ అన్నీ రాజాకు అవకాశం ఇచ్చింది.
అమేఠీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి దిగ్గజ నేతలు ఈ స్థానం నుంచి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. 2014 నుంచే ఈ సీటులో హోరాహోరీ పోటీ మొదలైంది. 2014 ఎన్నికల్లో అమేఠీ నుంచి తొలిసారి పోటీచేసిన స్మృతి ఇరానీ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే విజయం వరించింది. అయితే 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ గెలిచారు. ఇప్పుడు వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకోబోతున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. అయితే ఆయన ఈసారి కూడా రెండో స్థానంగా అమేఠీ నుంచి బరిలోకి దిగుతారా? లేదా? అనేదానిపై కొన్ని రోజుల్లోనే పార్టీ క్లారిటీ ఇవ్వనుంది.
తిరువనంతపురం
కేరళలోని తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వరుసగా నాలుగోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేరళలో బీజేపీ ఖాతా తెరవాలనే పట్టుదలతో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న మరో ప్రముఖ నాయకుడు పన్నయన్ రవీంద్రన్. 2005 సంవత్సరంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ట్రాక్ రికార్డు రవీంద్రన్‌కు ఉంది. ఈయన ప్రస్తుతం ఎల్డీఎఫ్ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారు.
బెహరాంపుర్
ఈసారి అందరి చూపు బంగాల్‌లోని బెహరాంపుర్ లోక్‌సభ స్థానంపైనా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీ చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయనకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ టికెట్ ఇచ్చింది. గుజరాత్‌లోని వడోదరా ప్రాంతానికి చెందిన యూసుఫ్ పఠాన్‌కు ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండే బెహరాంపుర్ నుంచి పోటీకి నిలపడం గమనార్హం. ఈ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధీర్ రంజన్ చౌదరి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేతగానూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. బంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఈ నేపథ్యంలో అధీర్‌కు చెక్ పెట్టే వ్యూహంతోనే యూసుఫ్ పఠాన్‌ను మమతా బెనర్జీ బరిలోకి దింపారని తెలుస్తోంది. 1999 నుంచి ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు బెహరాంపుర్ నుంచి అధీర్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు వరుసగా ఆరోసారి కూడా ఆయన పోటీ చేయనున్నారు.
న్యూదిల్లీ
దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సురీ స్వరాజ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెను బీజేపీ న్యూదిల్లీ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి బరిలోకి దింపుతోంది. వరుసగా గత రెండు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ విజయం సాధించారు. ఈసారి మాత్రం ఇక్కడి నుంచి బీజేపీ తరపున బన్సురీ స్వరాజ్ పోటీ చేయనున్నారు. ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి ఢీకొననున్నారు. ఇక్కడ ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. సోమనాథ్ భారతి ప్రస్తుతం మాలవ్య నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.