Lok Sabha Elections 2024 Bengal Minorites :సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాలు దూసుకుపోతుండడం వల్ల బంగాల్‌లో రాజకీయ వేడి పెరిగింది. బంగాల్‌లో మళ్లీ సత్తా చాటాలని బీజేపీకి చెక్ పెట్టాలని మిగిలిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బంగాల్‌లో చాలా నియోజక వర్గాల్లో మైనార్టీలు గెలుపోటములను నిర్ణయించే దశలో ఉన్నారు. కశ్మీర్, అసోం తర్వాత దేశంలో అత్యధిక ముస్లిం ఓటర్ల సంఖ్య బంగాల్‌లోనే ఉంది. అందుకే అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు మైనార్టీ ఓట్లపైన పడ్డాయి. బంగాల్‌లో దాదాపు 33 శాతం మంది మైనార్టీలు ఉన్నారు. ఈ మైనార్టీల ఓట్లను దక్కించుకుని భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష-కాంగ్రెస్ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి.
టీఎంసీవైపే మైనార్టీల మొగ్గు!
అయితే వామపక్ష-కాంగ్రెస్ కూటమి కంటే తృణమూల్ కాంగ్రెస్ వైపే మైనార్టీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగాల్లోని లోక్‌సభ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే ముస్లింలంతా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని మైనార్టీ నాయకులు చెబుతున్నారు. వామపక్ష-కాంగ్రెస్ కూటమిని కాకుండా టీఎంసీనే విశ్వసనీయ శక్తిగా మైనార్టీలు భావిస్తున్నారని ఆ సంఘం నేతలు వెల్లడించారు. మైనారిటీలు అత్యధికంగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో టీఎంసీవైపు మైనార్టీల మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది.
టీఎంసీకి మద్దతుగా ఇమామ్‌ల కృషి?
కాంగ్రెస్-వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడం కూడా హస్తం పార్టీకి మైనార్టీలను దూరం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం, పౌరసత్వ సవరణ చట్టం అమలే ప్రధాన అంశాలుగా బంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే దీదీ ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి ఉన్నా బీజేపీని ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటు వేయడం చాలా కీలకమని మైనారిటీ నాయకులు భావిస్తున్నారు. మైనారిటీ ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవాలని ఇమామ్‌లు తమ సభ్యులకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
2019 ఎన్నికల్లో మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ ఓట్ల చీలక బీజేపీ విజయానికి దోహదపడింది. ఈసారి మైనారిటీ ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవాలని, చాలా స్థానాల్లో టీఎంసీకే మొగ్గు ఉంటుందని ఉత్తర బంగాల్‌లోని కొన్ని స్థానాల్లో వామపక్షాలు-కాంగ్రెస్ కూటమికి ఆదరణ లభించే అవకాశం ఉందని ఇమామ్-ఎహ్ ఖాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు.
'సందిగ్ధంలో మైనారిటీలు'
ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాల్లో మైనారిటీలు ఎవరికి ఓటు వేయాలా అన్న సందిగ్ధతలో ఉన్నారని బంగాల్ ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ యాహ్యా తెలిపారు. వామపక్ష-కాంగ్రెస్ కూటమి, టీఎంసీ అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై సందిగ్ధావస్థలో ఉన్నారని వివరించారు. ఈ జిల్లాల్లో మైనారిటీ ఓట్ల చీలిక వల్ల 2019లో ఉత్తర దినాజ్‌పూర్, మాల్దా జిల్లాల్లో బీజేపీ ఒక్కో సీటు గెలుచుకుంది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలంతా టీఎంసీకి మద్దతు పలికారు. ఈసారి కూడా అలాగే మద్దతు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.