K Annamalai Plans For LS Polls 2024 : ఈ సార్వత్రిక ఎన్నికల్లో 370 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికల్లో 303 చోట్ల జయభేరి మోగించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్ విజయం దద్దరిల్లిపోయేలా ఉండాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పట్టు కొనసాగిస్తూనే దక్షిణాదిలో ఉనికిని గట్టిగా చాటాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా తమిళనాట ఓట్ల శాతం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈసారి 20 శాతం ఓట్లతోపాటు కొన్ని సీట్లు కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశలో బీజేపీకి తురుపుముక్క లాంటి నాయకుడిలా అన్నామలై కనిపించారు. తమిళనాట ఇప్పటివరకూ ద్రవిడ వాదంపైనే రాజకీయాలు నడుస్తుండగా అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ హిందుత్వ వాదంపైనా చర్చ మొదలుపెట్టారు.
ఖాతా తెరవని బీజేపీ
ఇప్పటివరకూ తమిళనాట బీజేపీకి ఓటర్ల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. 2014 ఎన్నికల్లో ఒక్కచోట గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. పక్క రాష్ట్రం కర్ణాటకలో చాలాసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తున్నప్పటికీ తమిళనాడులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
8నెలల్లో 235 చోట్ల పర్యటన
అయితే ఇటీవల తమిళ ప్రజల మనస్సుల్లో చోటు కోసం బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా ఎంతో దూకుడుగా పనిచేసిన అన్నామలై 2019లో తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనతికాలంలోనే అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆయన, 2021లో పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. 'నా నేల-నా ప్రజలు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు నిర్వహించిన అన్నామలై ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ తమిళనాట చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ 8నెలలపాటు 235 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుదీర్ఘ పర్యటనలు చేశారు.
మాజీ సీఎంలపైనే విమర్శలు
తమిళనాట అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేపై విమర్శలు గుప్పిస్తూ వాటికి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు అన్నామలై. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, జయలలితపైనా విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మిత్రపక్షం ఏఐఏడీఎంకే బీజేపీతో బంధం తెంచుకోగా డీఎండీకే, పీఎంకే, పీఎన్కే, టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే వంటి పార్టీలతో అన్నామలై జట్టు కట్టారు.