Jammu And Kashmir Elections 2024 :జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తును ప్రకటించాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తోంది. అయితే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) మాత్రం కాస్త ఇబ్బందుల్లో ఉంది. పార్టీని కొందరు ముఖ్య నాయకులు వీడటం, మరోవైపు ఎన్‌సీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల పీడీపీ విజయావకాశాలు కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పీడీపీ ఒంటిరిగా బరిలోకి దిగి తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఏమాత్రం రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పీడీపీ 31మంది అభ్యర్థులను ప్రకటించింది.
దాదాపు పొత్తు లేనట్లే!
ఇండియా కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సీ జమ్ముకశ్మీర్‌లోని 90 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. కాగా, జమ్ములోని 43 సీట్లలో ఇండియా కూటమికి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కశ్మీర్‌లోని 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఇండియా కూటమి బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ బీజేపీకి అంత బలం లేదు. కశ్మీర్ లోయలో ఇండియా కూటమికి పీడీపీ, అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, స్వతంత్ర అభ్యర్థులతో గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతో పీడీపీ పొత్తు దాదాపు లేనట్లే కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో పీడీపీతో కలిసి పోటీ చేస్తారా అని ఎన్‌సీ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఇటీవలే విలేకరులు ప్రశ్నించారు. అవన్నీ ఊహాగానాలేనని ఇరువురు నేతలు బదులిచ్చారు. అలాగే జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ కర్రా సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
'మా రాజకీయ ప్రత్యర్థి పీడీపీ'
పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలపై పీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపిందని ఎన్‌సీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఎలా మాట్లాడగలమని అన్నారు. 1999లో పీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఎన్సీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అని, గత 25 ఏళ్లలో రెండుసార్లు తమను అధికారానికి దూరంగా ఉంచిందని పేర్కొన్నారు. మరోవైపు, ఎన్నికలకు ముందు పొత్తు చర్చలు ఎన్‌సీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే జరిగాయని, పీడీపీని ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు "ఈటీవీ భారత్"కు తెలిపారు.