Etv Bharat Pratidwani :ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పండుగొచ్చినట్లే. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే నిష్పాక్షిక యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసుల్లో చాలామంది జగన్ భక్తుల్లా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినా సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి జగన్ సేవలో తరిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. జగన్ భక్తబృందంలోని ఓ ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసినా ఆ స్థానాలను మరికొందరు వీర విధేయులతో నింపేయడం సీఎస్, డీజీపీ స్వామిభక్తిని చాటుతోందనే చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, ప్రలోభాలు-భయాలకు తావు లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఈసీ ఏంచేయాలి? నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? "ఈసీ కళ్లకు వైఎస్సార్సీపీ గంతలు" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో హైకోర్టు న్యాయవాది కె.రజని, ఏపీ టుమారో వ్యవస్థాపకులు ఎన్.చక్రవర్తి పాల్గొన్నారు.
ECI Appoints IPS Officers in Andhra Pradesh : వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం వేటు వేసిన ఎస్పీలు, కలెక్టర్లల స్థానంలో కొత్త అధికారులను నియమించారు. అయితే నూతనంగా నియమించిన వారిలో చాలా మంది ఐదేళ్లలో అధికార వైఎస్సార్సీపీకు మద్దతుగా, ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర ఉంది. జాబితాలో సగానికి పైగా వైఎస్సార్సీపీ మనుషులే ఉన్నారు. అలాంటి వారినే ఏరికోరి ఎంపిక చేశారు సీఎస్ జవహర్‌రెడ్డి. సీఈసీ ఆదేశించినా ముగ్గురి ప్యానెల్‌తో జాబితా పంపాల్సిందే తానే కాబట్టి దాన్నే అవకాశంగా మార్చుకున్న సీఎస్ వైఎస్సార్సీపీకు ఊడిగం చేసే అధికారులనే మళ్లీ ప్రతిపాదించారు. ఎన్ని విమర్శలు వచ్చినా స్వామి భక్తి చాటుకోవడానికే ఆయన తపన పడుతున్నారు.
EC No Actions on Key Officers : రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే వారు ఆ పోస్టుల్లో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కాదన్న అభిప్రాయం కలుగుతోంది. ఆ అధికారుల్ని ఈసీ వెంటనే ఆ పోస్టుల నుంచి తప్పించాలని, లేకపోతే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగవన్న డిమాండ్‌లు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రయోజనాలను రక్షించడమే పరమావధిగా పనిచేస్తున్న ఆ అధికారులు తమ హోదాను, అధికారాల్ని ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేయగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీరాజేంద్రనాథరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘునాథరెడ్డి, డీఆర్‌ఐ చీఫ్ రాజేశ్వర్‌రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ వంటివారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు, వివిధ సంఘాలు పదే పదే ఆరోపిస్తున్నాయి.