తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బీజేపీ బిగ్ రివెంజ్- ఏడాదిన్నరలో మళ్లీ బిహార్ పీఠం కైవసం- ఫుల్ జోష్​తో లోక్​సభ ఎన్నికలకు! - bjp new planin bihar

BJP Strategy In Bihar : సార్వత్రిక ఎన్నికల ముందు విపక్ష ఇండియా బ్లాక్​కు పెద్ద షాక్ ఇచ్చి జేడీయూతో కలిసి బిహార్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఆ రాష్ట్ర సీఎంగా మరోసారి నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాదిన్నరగా మౌనంగా ఉన్న కమలం పార్టీ లోక్​సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేసింది.

BJP Strategy In Bihar
BJP Strategy In Bihar

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 5:40 PM IST

Updated : Jan 28, 2024, 5:50 PM IST

  • మహాగఠ్​బంధన్​తో జేడీయూ చీఫ్ తెగదెంపులు
  • ఇండియా కూటమి నుంచి నీతీశ్​ కుమార్​ ఔట్​

గతకొద్దిరోజులుగా దేశరాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధాన వార్తలివే. అలా వచ్చినట్లే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్​జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసి జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్​ మరోసారి బిహార్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేశారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం బీజేపీని వీడి ఆర్​జేడీ, కాంగ్రెస్‌, సీపీఐతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్,​ ఇప్పుడు ఎన్​డీఏ గూటికి చేరిపోయారు. మరికొద్ది రోజుల్లో లోక్​సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో నీతీశ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నీతీశ్‌ కుమార్‌ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ గూటికి చేరడం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ. కానీ ఎన్​డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతేడాది నీతీశ్ కుమార్ ఎన్​డీఏను వీడిన తర్వాత మౌనంగా ఉన్న బీజేపీ ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు తెరలేపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ సీట్లను పెంచుకునేందుకు ఎత్తుగడలు వేసింది. కాంగ్రెస్​కు షాక్ ఇచ్చి జేడీయాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అసెంబ్లీలో వారిదే పైచేయి!
ప్రస్తుత పరిస్థితుల్లో బిహార్‌ అసెంబ్లీలో మెజారిటీ సాధించే అవకాశాలు బీజేపీ- జేడీయూ కూటమికే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎమ్మెల్యేలను కూడగట్టి అసెంబ్లీలో బలనిరూపణకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రయత్నించినా వారిదే పైచేయి సాధించవచ్చని తెలుస్తోంది. జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బిహార్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్​జేడీ-79, బీజేపీ-78, జేడీయూ-45, కాంగ్రెస్‌-19, సీపీఐ(ఎం-ఎల్‌)-12, హెచ్‌ఏఎం-4, సీపీఎం, సీపీఐలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఇంకొకరున్నారు. జేడీయూ, బీజేపీ, హెచ్‌ఏఎం కలిస్తే వారి బలం 127కి చేరుతుంది. ఆర్​జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర సభ్యులు కలిసినా వారి సంఖ్య 116కు మించదు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాబట్టి బలనిరూపణలో బీజేపీ- జేడీయూ కూటమి నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లాలన్‌ సింగ్‌ వ్యవహారంతో!
అయితే జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ను తొలగించి ఆ పదవీ బాధ్యతలు తానే ఇటీవలే తీసుకున్నారు నీతీశ్‌. వాస్తవానికి సీఎం పదవి నుంచి తప్పుకుని ఆ బాధ్యతలు డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్​కు అప్పగించాలని లాలన్‌ సూచించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆర్​జేడీకి మద్దతు తెలిపేందుకు పార్టీని చీల్చాలని లాలన్‌ యోచించినట్టు సమాచారం. వీటిని తెలుసుకున్న నీతీశ్‌ ముందుగా చెక్‌పెట్టారు. ఇక ఆర్​జేడీ, ఇండియా కూటమి వైఖరితో విసిగిపోయి నీతీశ్‌ తిరిగి ఎన్​డీఏ గూటికి చేరారు. 40 లోక్‌సభ సీట్లు ఉన్న బిహార్‌ హిందీ బెల్ట్‌లో కీలకమైనది. అందుకనే కమలనాథులు కూడా ఈ రాష్ట్రంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు.

మోదీ అభినందనలు
మరోవైపు సీఎంగా రాజీనామా చేసిన అనంతరం నీతీశ్ కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కాల్ చేశారు. ఎన్​డీఏలోకి మళ్లీ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజీనామా నిర్ణయం తీసుకున్నందుకు అభినందించారు. అంతకుముందు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా నీతీశ్‌ను అభినందించారు. రాజీనామా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. "నీతీశ్‌ కుమార్‌కు ధన్యవాదాలు. ఆయనకున్న ఇబ్బందులు ఏమైనప్పటికీ ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఆటవిక రాజ్యంతో ప్రజలు ఆందోళన చెందారు. తేజస్వీ యాదవ్‌ ఆ సీటులో (ముఖ్యమంత్రి పదవిలో) కూర్చుంటే పరిస్థితి మరింత దారుణంగా మారేది. అతడి కోసం నీతీశ్‌పై లాలూ తీసుకొస్తున్న ఒత్తిడి చూసి భయపడ్డాను. రాష్ట్రంలో ఆ పరిస్థితులను బీజేపీ ఏమాత్రం అనుమతించదు" అని తెలిపారు

Last Updated : Jan 28, 2024, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details