తెలంగాణ

telangana

ETV Bharat / opinion

2 సీట్ల నుంచి 303కు- 4దశాబ్దాల్లో తిరుగులేని బీజేపీ ప్రస్థానం- కారణం వారే! - Lok Sabha Elections 2024

BJP Performance In Loksabha Polls : 1984లో రెండు సీట్లతో మొదలు పెట్టిన బీజేపీ, ఇప్పడు 303 సీట్ల స్థాయికి ఎదిగింది. ఆర్​ఎస్​ఎస్​ నుంచి మోదీ రాక వరకూ ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ ప్రస్థానం ఎలా సాగిందంటే?

BJP History
BJP History

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 8:15 AM IST

BJP Performance In Loksabha Polls : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి సార్వత్రిక సమరంలో పోరాడి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984 ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మాత్రమే గెలిచింది. తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హన్మకొండ, సికింద్రాబాద్‌ స్థానాల్లో కమలదళం బరిలో దిగింది. వాటిల్లో హనుమకొండలో మాత్రమే గెలిచింది. అక్కడ పార్టీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్‌ నేత పీవీ నరసింహారావుపై 54,198 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్‌లో టి.అంజయ్య (కాంగ్రెస్‌) చేతిలో బండారు దత్తాత్రేయ 8,474 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన రెండో సీటు గుజరాత్‌లోని మెహ్‌సాణా.

రాష్ట్రాలపై పట్టు బిగించి
గుజరాత్‌లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్‌కు బీజేపీ సవాలు విసిరింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ (29.99%), రాజస్థాన్‌ (23.69%), హిమాచల్‌ప్రదేశ్‌ (23.27%), దిల్లీ (18.85%)ల్లోనూ మెరుగ్గా ఓట్లు సాధించింది. మహారాష్ట్రలో 10.07%, హరియాణాలో 7.54%, మణిపుర్‌లో 6.96%, బిహార్‌లో 6.92%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 6.42%, కర్ణాటకలో 4.68%, పంజాబ్‌లో 3.39%, కేరళలో 1.75%, ఒడిశాలో 1.18%, త్రిపురలో 0.77%, తమిళనాడులో 0.07%, బంగాల్​లో 0.40%, అస్సాంలో 0.37% ఓట్లు దక్కించుకుంది. క్రమంగా బలం పెంచుకుంటూ 1990లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌లో, 1991లో ఉత్తర్‌ప్రదేశ్‌లో, 1993లో దిల్లీలో, 1995లో గుజరాత్‌, మహారాష్ట్ర(శివసేనతో కలిసి)లలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలిగే స్థాయికి వచ్చింది. తొలి ఎన్నికల్లో 10%కిపైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో కమలదళం తొలి పదేళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటుచేసి రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది.

ఆర్​ఎస్​ఎస్​ అండతో
బీజేపీ ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మదృష్టితోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్​ఎస్​ఎస్​) సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది. కమలదళం స్థానిక కుల, మత, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికనూ ఒక సవాల్‌గా తీసుకొని మరి పోరాడింది. ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, బంగాల్​లో మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో, మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది.

రామ జన్మభూమి ఉద్యమంతో
గత నాలుగు దశాబ్దాల్లో కమలదళం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే. ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని 1989 జూన్‌లో హిమాచల్‌లోని పాలంపుర్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని 1990 సెప్టెంబరు 25న ఎల్‌కే ఆడ్వాణీ గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్‌ 30 నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబరు 23న బిహార్‌లోని సమస్తీపుర్‌లో లాలూ ప్రసాద్‌ ప్రభుత్వం అడ్డుకుంది. ఆడ్వాణీని అరెస్ట్‌ చేసి 5 వారాలపాటు నిర్బంధించింది. ఇదే దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణకు బాటలు వేసింది. దాని ఫలితం 1991 నాటి యూపీ ఎన్నికల్లో కనిపించింది. అక్కడ బీజేపీ తొలిసారి విజయం సాధించి కల్యాణ్‌సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది.

కేంద్ర సర్కారు ఏర్పాటు స్థాయికి
1984 నుంచి 2004 వరకు వాజ్‌పేయీ, ఆడ్వాణీ బీజేపీని ముందుండి నడిపించారు. ముందుగా కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తులను కూడగట్టి, ఆ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టారు. తర్వాత హిందుత్వవాదాన్ని భుజాన వేసుకొని బీజేపీని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఓటుబ్యాంకును పెంచుకుంది. వ్యక్తులపై ఆధారపడకుండా, సంస్థాగతంగా బలోపేతమైంది. తన వ్యూహాలను, భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ఠ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుంది. ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి, అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలచుకుంటూ ఓట్లు రాబట్టుకొనే నేర్పు సాధించింది. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది.

మోదీ రాకతో ఉరకలు
2004 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఆపై అనారోగ్యంతో వాజ్‌పేయీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి ఆడ్వాణీ ఒంటరి పోరాటం చేశారు. అయితే 2009 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం 20%లోపునకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీజేపీ నాయకత్వం 2014లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడం వల్ల ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి. 2004-2014 మధ్య కాంగ్రెస్‌ చేసిన పొరపాట్లు, 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్‌, ఆదర్శ్‌ కుంభకోణాలు, అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, దిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బీజేపీ దిల్లీ పీఠంవైపు మోదీ సులభంగా నడిపించగలిగారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి బీజేపీకి ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి.

కర్ణాటకలో చక్రం తిప్పేది మనోళ్లే- లోక్​సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలకం- మద్దతు ఎవరికో? - Lok Sabha Election 2024

నటుడు రవి కిషన్‌కు DNA టెస్టు? ఆయనే తండ్రి అంటూ బాంబే హైకోర్టులో జూనియర్ నటి పిటిషన్ - BJP MP Ravi Kishan DNA Test

ABOUT THE AUTHOR

...view details