BJP Lok Sabha Elections 2024 Analysis :బీజేపీ అంటేనే బిగ్ టార్గెట్ అనేలా ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 370 సాధించాలనే పెద్ద గోల్‌ను కమలదళం పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ, వరుసగా మూడోసారి కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మోదీ సేన ముందుకు సాగుతోంది. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 414 స్థానాలకు గెల్చుకోగలిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రయత్నాలకు సానుభూతి కూడా తోడైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి అంతగా సీట్ల మైలేజీని సాధించిపెట్టే అంశాలు ఏమున్నాయి? 2019 ఎన్నికల్లో 303 లోక్‌సభ సీట్లను సాధించిన బీజేపీ, ఈసారి ఏకంగా 370 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమయ్యే విషయమేనా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీటికి సమాధానాలను ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
బీజేపీ 'బలాబలాలు'
- విపక్ష నేతలపైకి పదునైన విమర్శనాస్త్రాలను సంధించడంలో ప్రధాని మోదీ ఆయనకు ఆయనే సాటి. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేసిన తీరు అపూర్వం. బీజేపీ ఉనికి అంతం మాత్రంగానే ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణాలలో సంస్థాగత నిర్మాణం బలపడేలా ఆయన చేసిన పర్యటనలు అమోఘం. అక్కడి అధికార పార్టీలను టార్గెట్ చేస్తూ ఆయా రాష్ట్రాల ప్రజల చూపును బీజేపీ వైపునకు తిప్పడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలోపేతమైంది.
- ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పర్యవేక్షించే బలమైన వ్యవస్థ 2014 సంవత్సరం నుంచే బీజేపీకి ఉంది. ఇది ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలలో విస్తరించి ఉంది. అనుభవజ్ఞులైన ఎన్నికల ప్రచారకులు ఈ టీమ్‌లలో సభ్యులుగా ఉంటారు. ప్రజలను ప్రభావితం చేసే ప్రచార వ్యూహాలను రచించడంలో ఎన్నికల ప్రచారకుల టీమ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి.
- అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉన్న దాఖలాలు చాలా ఉన్నాయి. కమలదళం క్షేత్ర స్థాయిలో బలంగా ఉండబట్టే ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది.
- బీజేపీకి మరో బలం ఉంది. అదేమిటంటే ఎన్నికల పోరుకు పిచ్‌ను సెట్ చేసే విషయంలో దానికి తిరుగులేని పట్టు ఉంది.
- జాతీయ, సాంస్కృతిక అంశాలే బీజేపీ ఎజెండాలో ప్రధానంగా ఉంటాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని టచ్ చేసేలా ఉంటాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం కూడా ప్రతీచోటకు చేరడం పెద్ద అడ్వాంటేజ్.
బీజేపీ 'బలహీనతలు'
- దేశ రాజకీయాల్లో బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబాలకు చెందిన వారికి ఇటీవల కాలంలో కమలదళం కీలక పదవులను కట్టబెట్టింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ ఆ కోవలోకే వస్తారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి వారికి పెద్ద పరీక్షా సమయంగా మారనున్నాయి. దీన్ని ప్రతిపక్షాలు అదునుగా మలుచుకొని ప్రయోజనం పొందే ముప్పు లేకపోలేదు.
- బీజేపీ హిందుత్వ ఎజెండా ప్రతీసారీ ఫలితాలను ఇస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కావడం వల్ల బీజేపీ చేతిలో ఇక అంత పెద్ద స్థాయి కలిగిన ప్రచార అస్త్రమేదీ మిగల్లేదు.
- కేవలం సంక్షేమ పథకాల గురించి వివరించి ఓట్లు అడిగితే బీజేపీ అభ్యర్థులు నెగ్గుతారా ? అంటే కాదనే చెప్పాలి. వాటితో పాటు చాలా అంశాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్థానిక సమీకరణాలు కూడా కీలకంగా మారుతాయి.
- ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారత దేశంలో బీజేపీ క్యాడర్ అంత స్ట్రాంగ్‌గా లేదు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా సౌత్‌లో క్యాడర్‌ను బీజేపీ బలోపేతం చేయలేకపోయింది.