తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బిహార్​ బరిలో 'మజ్లిస్'​- NDA, ఇండియా అభ్యర్థులకు సవాల్​- లెక్కలు మారతాయా? - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Bihar Seemanchal Majlis Party : బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. అందుకే అక్కడి ఐదు లోక్​సభ సీట్లపై మజ్లిస్ పార్టీ గురి పెట్టింది. అక్కడి అన్ని స్థానాల్లోనూ బరిలోకి దింపాలని ఒవైసీల రాజకీయ పార్టీ యోచిస్తోంది. ఆయా సీట్లలో ఓ వైపు ఎన్డీఏ అభ్యర్థులు, మరోవైపు ఇండియా కూటమి అభ్యర్థులను బలంగా ఢీకొట్టాలని అసదుద్దీన్ ఒవైసీ వ్యూహరచన చేస్తున్నారు.

Triangular Contest In Bihar Lok Sabha polls
Triangular Contest In Bihar Lok Sabha polls

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 2:58 PM IST

Bihar Seemanchal Majlis Party :హైదరాబాద్‌కు చెందిన ఒవైసీల రాజకీయ పార్టీ మజ్లిస్ బిహార్‌ ఎన్నికల బరిలోకి కూడా దిగింది. ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా గణనీయంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థులను వారు ఢీకొంటున్నారు. ఈ రసవత్తర పోటీపై 'ఈటీవీ భారత్' పరిశీలన మీకోసం.

11 మంది మజ్లిస్ అభ్యర్థులు- కిషన్‌గంజ్‌పై గురి?
సీమాంచల్ ప్రాంతంలో కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, అరారియా అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. వీటిలో ముస్లిం జనాభా ఎక్కువ. ఈ స్థానాల్లో రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి, మజ్లిస్ పార్టీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బిహార్‌లోని మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన మజ్లిస్, ఇప్పటివరకు ఇంకా అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. మొత్తం 11 మంది అభ్యర్థుల్లో ఐదుగురు ముస్లిం అభ్యర్థులు ఉంటారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి.

కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం పరిధిలో 68 శాతం ముస్లిం ఓటర్లే ఉన్నారు. ఇక్కడి నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మహ్మద్ అక్తరుల్ ఇమాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం మజ్లిస్ పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అక్తరుల్ ఇమాన్‌కు మద్దతుగా మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఐదు రోజుల పాటు కిషన్‌గంజ్‌లోనే మకాం వేసి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కిషన్‌గంజ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత మహ్మద్ జావేద్‌‌కే మళ్లీ టికెట్ దక్కింది. ఆయనకు ఇండియా కూటమి పార్టీ ఆర్జేడీ మద్దతు కూడా ఉంది. ఇక ఎన్డీయే కూటమి తరఫున జేడీయూ నేత ముజాహిద్ ఆలంకు టికెట్ దక్కింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రెండోస్థానంలో ముజాహిద్ ఆలం నిలిచారు. మూడో స్థానంలో మజ్లిస్ అభ్యర్థి నిలిచారు. ఈసారి కూడా అదే విధమైన ముక్కోణపు పోటీ కిషన్‌గంజ్‌లో జరగనుంది.

మజ్లిస్‌ పోటీతో లెక్క మారుతుందా?
ఇదొక్కటే కాదు సీమాంచల్ ప్రాంతంలోని కతిహార్, పూర్నియా, భాగల్‌పుర్, బంకా లోక్‌సభ స్థానాల్లోనూ ఇదే విధమైన ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ అన్ని చోట్ల కూడా ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులకు మజ్లిస్ సవాల్ విసురుతోంది. ముస్లిం ఓటర్ల మద్దతు తమకు ఉంటుందని మజ్లిస్ భావిస్తోంది. అయితే మజ్లిస్ పార్టీ ఓట్లను చీల్చడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందనేది ఇప్పుడు ఆయా స్థానాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

దీనివల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందని ఇండియా కూటమి నేతలు అంటుంటే కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందని ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. కతిహార్‌ స్థానం నుంచి పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ తారిఖ్‌ అన్వర్‌, కిషన్‌గంజ్‌ స్థానం నుంచి మహమ్మద్‌ జావేద్‌‌లకు కాంగ్రెస్ టికెట్స్ ఇచ్చింది.

పూర్నియాలో పప్పూ యాదవ్ ఎంట్రీతో!
కాంగ్రెస్ పార్టీ సీమాంచల్ ప్రాంతంలోని కిషన్ గంజ్, కతిహార్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ప్రముఖ నేత పప్పూ యాదవ్ ఇటీవలే తన జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దానికి బదులుగా తనకు కిషన్ గంజ్ లోక్‌సభ టికెట్ ఇవ్వాలని కోరారు. తీరా పార్టీ విలీనం జరిగాక కాంగ్రెస్ అందుకు నో చెప్పింది. దీంతో పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి పప్పూ యాదవ్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పినా వినకుండా ఆయన పూర్నియా ఎన్నికల బరిలో నిలిచారు. గత నెలలో నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీని వదిలి ఆర్జేడీలో చేరిన భీమా భారతికి పూర్నియా టికెట్ దక్కింది. ఇక్కడి నుంచి జేడీయూ అభ్యర్థిగా సంతోష్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు. ఇదే విధంగా సీమాంచల్‌లోని కతిహార్, భాగల్‌పూర్, బంకా స్థానాల్లో ముక్కోణపు పోటీ జరుగుతోంది.

ప్రచారంలో నితీశ్, తేజస్వి
బిహార్ సీఎం నితీశ్ కుమార్ గత శుక్రవారం నుంచే సీమాంచల్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. యాదవ వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న మాధేపురా కేంద్రంగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. పూర్నియా, కతిహార్‌లలో జరిగే ర్యాలీల్లో ప్రసంగించారు. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

దివ్యాంగులతో పోలింగ్​ కేంద్రాలు- ఎన్నికల నిర్వహణ మొత్తం వారిదే- అదే కారణమట! - lok sabha elections 2024

ఐటీ హబ్​లో నీటి సంక్షోభం- ఎన్నికలపై తీవ్ర ప్రభావం- ఓటర్లకు ముఖం చాటేస్తున్న అభ్యర్థులు - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details