Analysis On Congress Victory Chances In Lok Sabha Polls 2024 :పదేళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఓడిపోవడం వల్ల దేశవ్యాప్తంగా పార్టీ రాజకీయ ప్రతిష్ఠ గణనీయంగా దెబ్బతింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ శక్తివంతంగా మారడం వల్ల పార్టీ ప్రతిష్ఠ, మనుగడ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కఠిన పోటీని ఎదుర్కోనుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి గత దశాబ్దం వరకు దేశ రాజకీయాల మీద ఆధిపత్యం చలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. అటువంటిది రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియాకు కాంగ్రెస్ నాయకత్వం వహించడం ప్రశ్నార్ధకమే.
డిపాజిట్లు కోల్పోతున్న అభ్యర్థులు
138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మోదీ పాలనతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి అవసరమైన మొత్తం బలంలో 10 శాతం సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. వారసత్వ కుటుంబ రాజకీయాలకు కేరాఫ్‌గా మారిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 421 సీట్లకు గాను కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2014లో పోటీచేసిన 464 స్థానాలకు గాను కేవలం 44 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. 2014లో 178 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 2019లో 148 మంది నేతలు డిపాజిట్ కోల్పోయారు.
కాంగ్రెస్ సీట్ల సరళి
1984లో రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 1989 సార్వత్రిక ఎన్నికల్లో దాని లోక్‌సభ బలం 197 స్థానాలకు పడిపోయింది. 1991లో 232, 1996లో 140, 1999లో 114, 2004లో 145, 2009లో 209 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 20 ఏళ్ల తరువాత 200 స్థానాలను దాటింది. 2014, 2019లో ప్రతిపక్ష హోదాను కూడా సాధించుకోలేక కొట్టుమిట్టాడుతోంది.
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపాలైనప్పటికీ పార్టీకి ఉన్న 19 శాతం ఓట్ షేర్‌ను కొనసాగించడం ఒక్కటే కాస్త ఆశాజనకమైన అంశం. ఇప్పుడు దానిని పెంచుకోవాలని భావిస్తోంది. 2009లో మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చాక 28 శాతం ఓట్లు సాధించారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపోటములను నిశ్చయించేది ఆ పార్టీ బలాలు, బలహీనతలే. ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి ఉన్న అవకాశాలు, పొంచి ఉన్న ముప్పుపై ఒకసారి విశ్లేషణ చేద్దాం.
కాంగ్రెస్ బలాలు
- వందేళ్ల రాజకీయ అనుభవం కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, మైనారిటీల సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉంది. లౌకిక, అందరిని కలుపుకుని పోయే విధంగా పాన్ ఇండియా పార్టీగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఉంది. రానున్న ఎన్నికల్లో కులగణన అంశంతో పాటు, అతిపెద్ద ఓటర్లు కలిగిన ఓబీసీలను ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
- పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, యువత, మహిళలు అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన హామీలను ప్రకటించింది. భారతదేశానికి సాధికారిత కల్పించడానికి 5 హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ ఇలా పలు అంశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
- క్యాడర్, లీడర్లు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత ఉనికి ఉంది. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యం లాంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల పోలింగ్‌లో ప్రభావం చూపించే యువ ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.