How to Grow Water Apples at Home:ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక పండ్లు అనగానే యాపిల్, దానిమ్మ, అరటి, బొప్పాయి, నారింజ అంటూ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ మనకు పేర్లు కూడా తెలియని పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో వాటర్ యాపిల్ ఒకటి. ఈ పండును అందరూ చూసే ఉంటారు కానీ దాని పేరు మాత్రం తెలియకపోవచ్చు. నిగనిగలాడుతూ దోరగా నోరూరించే వాటర్ యాపిల్, రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగానూ మేలు చేస్తుంది. అయితే బయట మార్కెట్లో లభించే ఈ పండును ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మరి, దీన్ని ఎలా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాటర్ యాపిల్‌నే రోజ్ యాపిల్, చంబక్క, జంబు, పానీసేబ్, మలబార్ ప్లమ్ అంటూ ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారతదేశంలోని కొన్ని ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరుగుతాయి. దీని శాస్త్రీయనామం సీజీజీయం ఆక్వియమ్.
నీటి శాతం ఎక్కువే: ఈ మొక్కకు మార్చి నుంచి ఆగస్టు వరకూ కాయలు కాస్తాయి. ఈ పండ్లు మొదట ఆకుపచ్చగా ఉండి పక్వానికి వచ్చే కొద్దీ గులాబీ రంగులోకి మారతాయి. ఇవి లోపల తెల్లగా ఉంటాయి. దీనిలో నీటిశాతం ఎక్కువ. ఔషధ గుణాలూ అధికమే. సులువుగా పెరిగే లక్షణం ఉండటం వల్ల దీన్ని ఇంటి తోటల్లో బాగా పెంచుకుంటారు. సాధారణంగా ఇది నేలలో ఎత్తుగా, బలంగా పెరుగుతుంది. అయితే, ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.