Veg Kurma Recipe in Telugu : మనం హోటల్స్‌కి వెళ్లినప్పుడు పూరీ, చపాతీ, పరోటా వంటి టిఫెన్స్‌కి కుర్మా కూర ఇవ్వడం చూస్తుంటాం. అయితే, ఇంట్లో కూడా అలాంటి టిఫెన్స్ చేసుకున్నప్పుడు అందులోకి సైడ్ డిష్‌గా ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ తీసుకొచ్చాం. అదే.. "వెజిటబుల్ కుర్మా". ఈ స్టైల్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! పైగా దీన్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
మసాలా పేస్ట్ కోసం :
- 1 కప్పు - పచ్చికొబ్బరి తురుము
- 2 టేబుల్‌స్పూన్లు - వేయించిన పుట్నాల పప్పు
- కొన్ని - జీడిపప్పు పలుకులు
- అంగుళం ముక్క - దాల్చిన చెక్క
- 2 - యాలకులు
- 4 - లవంగాలు
- 1 టీస్పూన్ - జీలకర్ర
- 1 టీస్పూన్ - సోంపు గింజలు
- నాలుగు - వెల్లుల్లి రెబ్బలు
- చిన్న - అల్లం ముక్క
- 5 - పచ్చిమిర్చి
- 2 రెమ్మలు - కరివేపాకు
- రుచికి సరిపడా - ఉప్పు
- కొద్దిగా - కొత్తిమీర తరుగు
- కొన్ని - పుదీనా ఆకులు
- వాటర్ - తగినన్ని
కుర్మా కోసం :
- 3 టేబుల్‌స్పూన్లు - ఆయిల్
- 1 టీస్పూన్ - జీలకర్ర
- 1 టీస్పూన్ - ఆవాలు
- ఉల్లిపాయలు - 2
- బంగాళదుంప - 1
- క్యారెట్ - 1
- అర కప్పు - బఠాణీలు
- కొద్దిగా - బీన్స్ తరుగు
- 2 - టమాటాలు
- అరటీస్పూన్ - ఉప్పు
తయారీ విధానం :
- ముందుగా రెసిపీలోకి ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చికొబ్బరి తురుము, వేయించిన పుట్నాల పప్పు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనాతో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం కుర్మాలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, బీన్స్‌ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపనుచిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలక్రర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి.
- ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకున్నాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఆనియన్స్ కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి.
- అవి వేగాయనుకున్నాక.. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని క్యారెట్, బీన్స్, టమాటా ముక్కలు, బఠాణీలు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై ఉప్పు, కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అనంతరం మూత తీసి ఒకసారి మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆపై మరో అరకప్పు వాటర్ యాడ్ వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద మసాలా మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "వెజిటబుల్ కుర్మా" రెడీ!
- దీన్ని రైస్, టిఫెన్స్, పులావ్ ఇలా దేనిలోకి సర్వ్ చేసుకొని తిన్నా సైడ్ డిష్‌గా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది!
ఇవీ చదవండి :
సూపర్ టేస్టీ "క్యాబేజీ కుర్మా" - ఓసారి ఇలా ట్రై చేయండి! - వద్దన్నవాళ్లే ప్లేట్లు నాకేస్తారు!
నిమిషాల్లో ఘుమఘుమలాడే "మీల్ మేకర్ కుర్మా"- ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే మటన్ కూడా దిగదుడుపే!