How to Make Brinjal Kothimeera Karam:కూరల్లో రారాజు.. వంకాయ. అందుకే వీటితో ఎన్ని రకాల కూరలు చేసినా "ఆహా ఏమి రుచి అనరా మైమరచి" అంటూ పాడుకుంటూ లొట్టలేసుకుని తింటుంటారు. ఇక వంకాయతో ఎన్ని వెరైటీలు చేసినా అస్సలు బోర్ కొట్టదు. ఇంకా ఎప్పటికప్పుడు సరికొత్తగా చేయాలని ఆలోచిస్తుంటారు. మరి మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం అద్దిరిపోయే "వంకాయ కొత్తిమీర కారం" రెసిపీ తీసుకొచ్చాం. చాలా తక్కువ పదార్థాలతో అతి తక్కువ సమయంలో అద్దిరిపోయే రుచితో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కేవలం అన్నంలోకి మాత్రమే కాదు చపాతీ, పూరీల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
కారం కోసం:
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర కట్ట - ఒకటి
జీలకర్ర - 1 టీ స్పూన్
వాటర్ - 1 టేబుల్ స్పూన్
కర్రీ కోసం:
నూనె -3 టేబుల్ స్పూన్లు
వంకాయలు - అర కిలో
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 75ml
పసుపు - పావు చెంచా
తయారీ విధానం:
- ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు నల్లగా మారకుండా ఓ గిన్నెలోకి ఉప్పు, నీళ్లు పోసి కలిపి అందులో వీటిని వేసుకుని పక్కన పెట్టాలి..
- ఇప్పుడు పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి, కాడలతో సహా కొత్తిమీర, జీలకర్ర, నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచాలి. కావాలంటే ఈ పేస్ట్‌ను రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇలా రోట్లో దంచితే రుచి అద్దిరిపోతుంది.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఓ 5 నిమిషాలు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు, పసుపు వేసి కలిపి మూత పెట్టి నీళ్లు ఇంకి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్‌ను వేసి బాగా కలిపి కారం పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి.
- పచ్చి వాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండి నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే వంకాయ కొత్తిమీర కారం రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
నోరూరించే తెలంగాణ స్టైల్ "వంకాయ పచ్చికారం" - వేడివేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి కిర్రాక్ కాంబినేషన్!
గుత్తి వంకాయను మించిన "వంకాయ గుజ్జు కూర" - ఇలా చేశారంటే ఫుల్ ఖుష్ అయిపోవాల్సిందే!