తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తెలుగు రాష్ట్రాల "ప్రయాగ్​ రాజ్​లు" ఇవే! - త్రివేణి సంగమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? - TRIVENI SANGAM IN TELUGU STATES

- మనకూ ఉన్నాయి త్రివేణి సంగమాలు - సప్తనదీ సంగమ స్థానం కూడా!

Triveni Sangam in Telugu States
Triveni Sangam in Telugu States (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 10:15 AM IST

Triveni Sangam in Telugu States : ఉత్తర్ ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున మహా కుంభమేళా జరుగుతోంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఉత్సవం వైభవంగా సాగుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం, త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుందని భక్తకోటి నమ్మకం. మరి, ఇలాంటి సంగమ ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కందుర్తి సంగమం :

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, కందకుర్తి గ్రామంలో త్రివేణి సంగమం ఉన్నది. ఈ ప్రాంతంలో గోదావరి, హరిద్ర, మంజీర నదులు ఒకేచోట కలుస్తాయి. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద జన్మించిన గోదావరి, నిజామాబాద్ లోని కందకుర్తి ప్రాంతం నుంచే తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే మంజీర నది, హరిద్ర నదులు గోదావరిలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ త్రివేణి సంగమాల్లో ఇది ఒకటి. ఇక్కడ గోదావరి నది ఒడ్డున పురాతన శివాలయం ఉన్నది. అందుకే కందకుర్తి గ్రామాన్ని కాశీ, రామేశ్వరంతో సమానమైన పుణ్యక్షేత్రమని భక్తులు భావిస్తారు.

కాళేశ్వర సంగమం :

ఇది కూడా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. మహాదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వర శైవక్షేత్రం వద్ద త్రివేణి సంగమం ఉన్నది. ఈ ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. అయితే పురాణాల్లో చెప్పిన సరస్వతి నది ఇక్కడ కలుస్తుందని భక్తులు నమ్ముతారు. (ఉత్తర ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​లో కూడా భౌతికంగా గంగా, యమున నదులు మాత్రమే కలిసి కనిపిస్తాయి. సరస్వతి నది అనేది పురాణాల్లోనే ఉంది. ఈ నది అంతర్వాహిణిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతారు.) కాళేశ్వర సంగమం వద్ద "కాళేశ్వర ముక్తీశ్వర స్వామి" గుడి ఉంది.

సంగం :

ఈ త్రివేణి సంగమం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో ఉన్న ఈ సంగమ ప్రదేశంలో వేగావతి, నాగావళి, సువర్ణ ముఖి నదులు కలుస్తాయి. దీన్నే 'సంగం' అని పిలుస్తారు. ఈ సిక్కోలు సంగమం, అలహాబాద్‌లో ఉన్న త్రివేణి సంగమానికి సమానమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతం శ్రీకాకుళానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సంగమేశ్వరం :

ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. తూర్పుకనుమల్లోని వరాహ పర్వతాల్లో జన్మించిన తుంగ, భద్ర అనే 2 నదులు కర్నాటకలో ఉన్న చిక్‌మంగళూరు జిల్లాలో కలిసిపోయి తుంగభద్రగా ఏర్పడతాయి. అదే రాష్ట్రంలో కొంత దూరం ప్రయాణించి, కర్నూలు జిల్లాలోని కొసిగి వద్ద ఆంధ్రప్రదేశ్​లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రవహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని గుండిమల్ల గ్రామ సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక్కడ " సంగమేశ్వరం" అనే ప్రముఖ దేవాలయం ఉంది. అయితే, ఇది ఆంధ్రప్రదేశ్​ పరిధిలో ఉంటుంది.

ఈ సంగమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థానం కాకుండా, సప్తనదీ సంగమస్థానం అంటారు. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమాహారతి, మలపహరిణీ, భవనాసి ఇలా మొత్తం 7 నదులు ఇక్కడ కలుస్తాయని పండితులు చెబుతుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4 నదీ సంగమాలు ఉన్నాయన్నమాట. శివరాత్రి సమయంలో ఈ సంగమాలు భక్తులతో కిటకిటలాడుతాయి.

ఇవి కూడా చదవండి :

మహా కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? 'రాజ' స్నానం చేస్తే అంత మంచిదా!

మహా కుంభమేళాకు వెళ్తున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే మీ జర్నీసేఫ్ అండ్​ హ్యాపీ​!

ABOUT THE AUTHOR

...view details