Tounge Tells About Your Health: నాలుకను మన ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే, సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుక లేత ఎరుపు రంగులో ఉంటుంది. పైన పాలిపోయిన తెల్లటి పొర కనిపిస్తుంటుంది. కానీ, అలా కాకుండా మీ నాలుకపై ఈ స్టోరీలో చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అవి పలు ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరిక సంకేతాలుగా చెప్పుకోవచ్చంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాలుక పొడారితే :మీ ఒంట్లో నీటి శాతం తగ్గిందని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని అర్థం చెసుకోవాలని చెబుతున్నారు.
పాలిపోయినట్లుగా ఉంటే :ఈ లక్షణాన్ని రక్తహీనతకు(Anemia) హెచ్చరిక సంకేతంగా భావించొచ్చంటున్నారు.
నున్నగా ఉంటే : మీ నాలుక నున్నగా, మృదువుగా ఉన్నట్లు కనిపిస్తే అది శరీరంలో పోషకాల కొరతకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్లు లోపించడం వల్ల ఇన్ఫెక్షన్లు, సెలియాక్ డిసీజ్, కొన్ని మందులు వంటివి నాలుకను మృదువుగా చేయడానికి కారణం కావచ్చని చెబుతున్నారు.
2018లో "జర్నల్ ఆఫ్ క్లినికల్ రుమటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నాలుక మృదువుగా ఉండే లక్షణం ఐరన్ లోపాన్ని సూచిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టర్కీలోని Erciyes University Faculty of Medicineలో ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ Mehmet Rami Helvaci పాల్గొన్నారు.
నల్లగా ఉంటే : ఇది గొంతులో బ్యాక్టీరియా లేదా ఫంగస్‌కు సంకేతం కావొచ్చంటున్నారు. అలాగే ఐరన్ మాత్రలు, బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా నాలుక నల్లగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రంగు క్యాన్సర్, అల్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా సూచిస్తుందంటున్నారు నిపుణులు.
పెరుగు తరకల పూత :రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ అదుపు తప్పినప్పుడు, హెచ్ఐవీతో బాధపడుతున్నప్పుడు నాలుకపై ఇలాంటి లక్షణం కనిపిస్తుందంటున్నారు.
నీలం రంగు :దీన్ని శ్వాస కోశ వ్యాధులకు హెచ్చరిక సంకేతం చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల నాలుక నీలం రంగులోకి మారుతుందని చెబుతున్నారు.