Tips to Stop Phone Addiction in Children :నేటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో సెల్‌ఫోన్ ఒక భాగమైపోయింది. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు ఫోన్లలోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా నేటి జనరేషన్ పిల్లలైతే స్మార్ట్‌ఫోన్ లేకుండా అరక్షణం గడపలేని పరిస్థితి ఏర్పడింది. అంతలా మొబైల్‌కి బానిసలా మారిపోయారు. స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినా ఏమాత్రం లెక్క చేయడం లేదు. పిల్లలకు చెప్పాల్సిన పెద్దలే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్‌ని నిషేధించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, ఇది చట్టంగా మారుతుందా లేదా అన్న సంగతి అటుంచితే.. "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..." అన్నట్టుగా మార్పు పెద్దల నుంచే స్టార్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. అందులో భాగంగానే ఇంట్లో వారానికో పూట, పూటకో గంట.. పూర్తిగా ఫోన్ చూడ్డాన్ని నిషేధించాలని చెబుతున్నారు. ఆ సమయంలో చేసే పనులతో ఎంత మేలో క్రమంగా అర్థమవుతుందంటున్నారు. అంతేకాదు, పిల్లల్ని స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా పెట్టడానికి కొన్ని ఫోన్ నియమాలను సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ముందుగా ఇంట్లోని పెద్దవాళ్లు అవసరానికి మాత్రమే సెల్‌ఫోన్ వాడేలా అలవాటు చేసుకోవాలి. అది కూడా వీలైనంత వరకు పిల్లల ముందు వాడకుండా జాగ్రత్త పడాలి.
- ముఖ్యంగా నిద్రకు ముందు, భోజనాల సమయంలో ఫోన్‌ని దూరంగా ఉంచాలి.
- స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక విరామ సమయాల్లో పెయింటింగ్, క్రోషె, మట్టితో ఆడటం పిల్లలకు నేర్పించడం చేయాలి.
- కాస్త పెద్ద పిల్లలైతే ఇంటి పనుల్ని అప్పగించాలి. అంటే.. కూరగాయలు తరగడం, బుక్‌షెల్ఫ్ సర్దడం, మొక్కలకు నీళ్లు పోయడం.. వంటివి చెబితే అందులోని మజా వాళ్లకు తెలుస్తుందంటున్నారు నిపుణులు.
- ఒక సంగీత పరికరం వాయించడంలో లేదా ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించడం చేయాలి. లేదంటే ఇంట్లో వారితోగానీ, ఫ్రెండ్స్‌తో గానీ క్యారంబోర్డు, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడేలా చూసుకోవాలి.
- కనీసం రోజులో ఒక గంటసేపైనా ఆడుకునేలా చూడాలి. తోటి పిల్లలతో కలిసి పరిగెత్తడం, సైకిల్ తొక్కడం.. వంటివి ఎంతో మేలు చేస్తాయి.
- పిల్లలకు సమయం దొరికినప్పుడు వారితో పుస్తకాలు చదవడం, కథల పుస్తకాలు, దినపత్రికలు చదివించడం వంటివి అలవాటు చేయాలి.
- సమయం దొరికితే టీనేజర్లకు ఈజీగా చేసుకునే కొన్ని వంటల్ని నేర్పించవచ్చు.
- ఏదైనా బుక్ క్లబ్‌లో, బోర్డు గేమ్స్ క్లబ్‌లో చేర్పించడం చేయాలి. వారికి తోటి పిల్లలతో కలిసి ఉండటం అలవాటవుతుంది.
- ఇకపోతే పిల్లలు ఎప్పుడైనా అరగంటకు మించి స్క్రీన్‌ని చూస్తే, కాసేపు విరామం ఇచ్చి.. తల పైకెత్తి చూడమనండి. రెండు చేతుల్నీ మణికట్టు దగ్గరనుంచీ సవ్య, అపసవ్య దిశల్లో 5 సార్లు తిప్పమనండి. ఆపై కనురెప్పల్ని 10 సార్లు అల్లల్లాడించమనండి.
- దీంతో కళ్లు, మెడ, మడమ మీద ఒత్తిడి తగ్గుతుంది. వారి మానసిక ఆరోగ్యానికి కొంతమేర మేలు జరుగుతుందంటున్నారు. ఇలా ఇంట్లో కొన్ని ఫోన్ నియమాలను ఫాలో అవ్వడం ద్వారా పిల్లల్లో వీలైనంత వరకు స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ ప్రభావాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.